Let's talk: editor@tmv.in
దావోస్ సదస్సుకు ఎనిమిది మందితో కూడిన అధికారిక బృందం

దావోస్ సదస్సుకు ఎనిమిది మందితో కూడిన అధికారిక బృందం

Panthagani Anusha
9 డిసెంబర్, 2025

రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం– దావోస్ వార్షిక సదస్సు–2026 లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సమావేశానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందాన్ని ప్రభుత్వం పంపనుంది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన మొత్తం ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు భరించనున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

కీలక శాఖల మంత్రులు, అధికారులు బృందంలో భాగస్వామ్యం

రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకమైన శాఖలకు చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు ఈ ప్రతినిధి బృందంలో భాగమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భారత్ ఈ బృందంలో పాల్గొననున్నారు. అధికారుల సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సాల్ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ఆరోగ్య, భద్రతా ఏర్పాట్ల కోసం ఒక పారామెడిక్ భద్రతా అధికారి ఈ బృందంతో పాటు దావోస్‌కు పయనం కానున్నారు.

ప్రతి ఏటా జరిగే దావోస్ సదస్సు ప్రపంచ నాయకులు, వివిధ పరిశ్రమల దిగ్గజాలు, విధాన నిర్ణయాలు తీసుకునే ప్రముఖులు సమావేశమయ్యే కీలక వేదిక. గ్లోబల్ పెట్టుబడి ధోరణులు, అత్యాధునిక సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్పులపై ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టుబడి అవకాశాలను విస్తరించే కీలక వేదికగా ఈ సదస్సును ప్రభుత్వం పరిగణిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్), డిజిటల్–ఐటీ సెక్టార్, ఔషధ తయారీ వంటి కీలక విభాగాల్లో రాష్ట్రం అందిస్తున్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. గ్లోబల్ కంపెనీల సీఈఓలతో నేరుగా చర్చలు జరిపి, రాష్ట్రానికి భారీ పెట్టుబడి ఒప్పందాల అవకాశాలను అన్వేషించడానికి ముఖ్యమంత్రి బృందానికి ఈ వేదిక అవకాశం కల్పించనుంది.

పెట్టుబడుల అనుకూల వాతావరణంపై అంతర్జాతీయ దృష్టి

ఇటీవలి నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలను ఈ అంతర్జాతీయ వేదికపై వివరించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో దావోస్ సమావేశాల్లో రాష్ట్రం గణనీయమైన స్పందన పొందిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి మరింత పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో సముచిత స్థానంలో నిలపడానికి కృషి చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

దావోస్ సదస్సుకు ఎనిమిది మందితో కూడిన అధికారిక బృందం - Tholi Paluku