Let's talk: editor@tmv.in
దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్

దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్

Gaddamidi Naveen
11 జనవరి, 2026

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2026 నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పెట్టుబడుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత రెండు దావోస్ పర్యటనలతో పాటు, ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో కుదిరిన పెట్టుబడి ఒప్పందాల అమలుపై అధికారులతో చర్చించారు.

3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ‘తెలంగాణ రైజింగ్–2047 విజన్’ను అంతర్జాతీయ స్థాయిలో దూకుడుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. ముఖ్యంగా క్యూర్ (క్లీన్, అర్బన్, రెసిలియంట్ ఎకానమీ), ప్యూర్ (ప్రొడక్టివ్, అర్బన్, రూరల్ ఎకానమీ) రేర్ (రిసెర్చ్, అగ్రికల్చర్, రీన్యూవబుల్, ఎంట్రప్రెన్యూర్షిప్) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రపంచ వేదికపై ప్రభావవంతంగా ప్రదర్శిస్తామని చెప్పారు.

2026 జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చురుకైన పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్” అనే థీమ్‌తో జరిగే ఈ సమావేశాల్లో రాష్ట్రం తీసుకొస్తున్న రూపాంతరాత్మక ప్రణాళికలను, పెట్టుబడిదారులకు స్పష్టంగా వివరించేలా అధికారులకు సూచించారు.

ఇప్పటికే పెట్టుబడి హామీలు ఇచ్చిన సంస్థలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని, ఏవైనా పెండింగ్ అంశాలు, అనుమతుల సమస్యలు లేదా మౌలిక వసతుల అడ్డంకులు ఉంటే వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడులు కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధిగా మారాలని ఆయన నొక్కి చెప్పారు.

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రాష్ట్ర బలాలు, సాంకేతిక సామర్థ్యం, పరిశ్రమల అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటుతూ, మూడు దిశలలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శించనుంది. ఈ ప్రయత్నాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలబెట్టడమే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.