Let's talk: editor@tmv.in
దావోస్‌లో చంద్రబాబు: ఏపీ ప్రగతికి ‘గ్రీన్’ సిగ్నల్!

దావోస్‌లో చంద్రబాబు: ఏపీ ప్రగతికి ‘గ్రీన్’ సిగ్నల్!

Dantu Vijaya Lakshmi Prasanna
22 జనవరి, 2026

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా టైమ్ మీడియా ప్రతినిధి టిమ్ హోవాట్, బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి జీనెత్ రోడ్రిగ్స్, బిజినెస్ టుడే ప్రతినిధి ఆలోక్ నాయర్, ఎన్డీటీవీ నుంచి ఆయుష్ ఐలావాది వంటి ప్రముఖ జర్నలిస్టులతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

అభివృద్ధికి ‘బ్రాండింగ్’ ప్రాధాన్యత

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ముందుగా మంచి బ్రాండింగ్ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. "గతంలో ఉమ్మడి ఏపీని, ఇప్పుడు నవ్యాంధ్రను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగించుకుంటున్నాను. బ్రాండింగ్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, తద్వారా అభివృద్ధి జరిగి పేదలకు సంక్షేమం అందించడం సాధ్యమవుతుంది" అని పేర్కొన్నారు.

ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్‌ వైపు..

పరిశ్రమల స్థాపనలో తమ ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకొచ్చిందని సీఎం వివరించారు. కేవలం 'ఈజ్ ఆఫ్ డూయింగ్' మాత్రమే కాకుండా, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్' విధానం ద్వారా అనుమతులు వేగంగా ఇస్తున్నాం.రియల్ టైమ్ మానిటరింగ్ తో అనుమతుల ప్రక్రియ నుంచి పరిశ్రమ ప్రారంభం వరకు ప్రతి అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతాల ద్వారా ప్రోత్సాహకాలు అందించే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఇజ్రాయెల్ ప్రతినిధులు, దౌత్యవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

ఈ అంశం పై ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రి నిర బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లోని ఇజ్రాయెల్ ఆర్థిక వాణిజ్య మిషన్ హెడ్ షిర్ స్లట్జ్కీలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, ఇజ్రాయెల్ కంపెనీలకు ఒక వేదికగా నిలిచేలా ఈ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా మెడ్-టెక్ (వైద్య సాంకేతికత), ఏరో-డిఫెన్స్ (గగనతల రక్షణ), మరియు క్లీన్-టెక్ రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ తయారీ కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించారు.

రక్షణ, ఏరోస్పేస్, మానవరహిత విమానాల (డ్రోన్లు) తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలపై కూడా చర్చలు జరిపారు. వీటితో పాటు సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే డీశాలినేషన్ ప్రక్రియ, భూగర్భ జలాల నాణ్యత పెంపు వంటి అంశాలపై కూడా చర్చలు సాగాయి.

"ఇజ్రాయెల్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఇండస్ట్రియల్ పార్కును ప్రతిపాదించాను," అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. వీటితోపాటు పర్యాటకారంగం అభివృద్దిపై కూడా పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చించారు.

గూగుల్ రాక - ఐటీ మంత్రి లోకేష్ చొరవ

విశాఖపట్టణానికి గూగుల్ కంపెనీ రాక ఏపీ అభివృద్ధిలో ఒక కీలక మలుపు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, నిరంతర ఫాలో-అప్ వల్లే ఈ భారీ పెట్టుబడి సాధ్యమైందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనిపై సంప్రదింపులు మొదలుపెట్టామని ఆయన వెల్లడించారు.

భవిష్యత్ నగరం - అమరావతి

రాజధాని అమరావతి నిర్మాణం ఒక అద్భుతమైన ప్రణాళికతో జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. "అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా, టెక్నాలజీతో కూడిన 'గ్రీన్-బ్లూ సిటీ'గా, ఒక భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతున్నాం." అని అన్నారు..

కీలక రంగాల్లో సంస్కరణలు

ప్రపంచమంతా గ్రీన్ అమోనియా గురించి మాట్లాడుతుంటే, ఏపీ అప్పటికే ఉత్పత్తికి సిద్ధమై విదేశీ ఎగుమతుల ఒప్పందాలు కూడా చేసుకుందని తెలిపారు. వ్యవసాయంలో టెక్నాలజీని విరివిగా వాడుతూ అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. చైనా, జపాన్ వంటి దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుంటే, భారత్ మాత్రం యువ శక్తితో బలంగా ఉందని, వారిని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక విధానాల వల్ల నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పారిశ్రామిక విధానంపై చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

దావోస్ లో మంత్రి లోకేష్ సమావేశాలు

దావోస్ పర్యటనలో భాగంగా స్కేల్ ఏఐ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రెవర్ థాంప్సన్ ను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ ఐటి మంత్రి లోకేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు . ఒక స్టార్టప్‌గా మొదలై, నేడు 29 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఎదిగిన స్కేల్ ఏఐ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రభుత్వాలు, సంస్థలు నమ్మకమైన ఏఐ వ్యవస్థలను రూపొందించుకోవడంలో వారి ప్లాట్‌ఫారమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.

విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భాగస్వాములు కావాలని స్కేల్ ఏఐని ఆహ్వానించారు. ఈ కేంద్రం ప్రధానంగా ఏఐ సేఫ్టీ, ఎవాల్యుయేషన్, గవర్నెన్స్, ఎల్‌ఎల్ఎమ్ బెంచ్‌మార్కింగ్, రెడ్-టీమింగ్, అప్లైడ్ ఏఐ డెలివరీ వంటి అత్యాధునిక అంశాలపై దృష్టి సారించనుంది.

ప్రజా సేవల నుంచి అధునాతన పారిశ్రామిక అప్లికేషన్ల వరకు, బాధ్యతాయుతమైన ఏఐకి ప్రపంచ కేంద్రంగా ఎదిగేందుకు అవసరమైన ప్రతిభ, సంస్థలు ఆశయం విశాఖపట్నంలో పుష్కలంగా ఉన్నాయని థాంప్సన్ తో జరిపిన చర్చల్లో లోకేష్ అన్నారు.

ఈ పర్యటనలో భాగంగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ జేఈఆర్‌ఏ గ్లోబల్ సీఈఓ, చైర్మన్ యుకియో తో సమావేశమైన లోకేష్ జపాన్, ఆసియా మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు వీలుగా, ఆంధ్రప్రదేశ్‌లోని పోర్ట్ ఆధారిత పారిశ్రామిక క్లస్టర్ల సమీపంలో గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టాలని జేఈఆర్‌ఏ ను ఆహ్వానించారు .

దీంతో పాటు పలు కీలక అంశాలపై లోకేష్ చర్చించారు. రాయలసీమలో సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, కీలక పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్స్, ఉద్గారాలను తగ్గించి, గ్రిడ్ విశ్వసనీయతను పెంచేందుకు ఏపీజెన్‌కో & ఎన్టీపీసీ లతో కలిసి అమోనియా కో-ఫైరింగ్‌పై పైలట్ ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి.