Let's talk: editor@tmv.in
దానం నాగేందర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

దానం నాగేందర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Gaddamidi Naveen
31 జనవరి, 2026

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై శుక్రవారం జరిగిన విచారణలో తాను టీఆర్ఎస్ పార్టీ తరఫున హాజరయ్యానని తెలిపారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అలాగే విచారణ ఎదుర్కొంటున్న దానం నాగేందర్ హాజరు కాకపోవడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తెరవెనుక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని అన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న 'మ్యాచ్ ఫిక్సింగ్'ను స్పష్టం చేస్తోందని, రెండు పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శించారు. దానంపై అనర్హత వేటు, ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆయ‌న అన్నారు.

దానం నాగేందర్‌తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులకు తగిన విధంగా గుణపాఠం చెప్పడం ఖాయమని గట్టిగా హెచ్చరించారు.

వీణవంక మండలంలో గురువారం నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం నెలకొంది. ఈ ఘటనను శాసనసభ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్ర‌వారం స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ సమర్పించారు. అలాగే దానం నాగేందర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మినీ మేడారం జాతరలో ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కరీంనగర్ జిల్లా సీపీ, ఏసీపీ, సీఐలు కలిసి తనను అదుపులోకి తీసుకోవడం తీవ్రంగా ఖండనీయమని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన చర్యగా అభివర్ణించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడిపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఈ ఘటన శాసనసభ హక్కులను, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్న ఆయన, బాధ్యులైన అధికారులపై ప్రివిలైజ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభలో స్పీకర్‌కు మోషన్ ఇచ్చామని వెల్లడించారు. పవిత్రమైన సమ్మక్క–సారక్క జాతరను రాజకీయ ప్రయోజనాల కోసం భంగపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో కరీంనగర్ సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐలు చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యే హక్కులను కాలరాస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, అప్పుడు ఈ అధికారులందరికీ చట్టప్రకారం గట్టి బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.