
దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం
భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా దసరా మహోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు నిరంతర పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. 15లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశమున్నందున అందుకు తగ్గట్లు చేసిన ఏర్పాట్లలో ఎక్కడా లోపాలు లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మూలా నక్షత్రం రోజున అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. హోల్డింగ్ పాయింట్లతో పాటు కేశఖండనశాల, స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, పార్కింగ్, భద్రత.. ఇలా ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా పరిశీలించారు. గిరి ప్రదర్శనతో ముడిపడిన అంశాలనూ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా మార్గాలను పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిరంతర పర్యవేక్షణతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తక్షణం పరిష్కరించేందుకు, కమ్యూనికేషన్ పరంగా వేగాన్ని అందిపుచ్చుకునేందుకు, సమన్వయ సాధనకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం, నగర పర్యటన మధురానుభూతులను మిగిల్చేలా ఈసారి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
