Let's talk: editor@tmv.in
దసరా ఏ ఒక్క మతానికి చెందింది కాదు

దసరా ఏ ఒక్క మతానికి చెందింది కాదు

Pinjari Chand
23 సెప్టెంబర్, 2025

దసరా రాష్ట్రంలోని ప్రజలందరీ పండుగ అని ఏ ఒక్క మతానికి, కులానికి చెందినది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య అన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నుంచి ఎన్ని అభ్యంతరాలు ఎదురైనప్పటికీ సోమవారం ఉదయం 11 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను చాముండీకొండపై బుకర్​ ఫ్రైజ్​ విజేత బానుముస్తాక్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ బానుముస్తాక్​ ముస్లిం మహిళే కావచ్చు. కానీ ప్రపంచం నలుమూలల కన్నడ ఖ్యాతిని నిలిపారు. ఆమె కన్నడ సాహిత్యానికి ఎంతో వన్నెతెచ్చారు అని కొనియాడారు.ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అలాగే ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైభవంగా జంబూ సవారీ ఉండనుంది. ఈ సమయంలో కులాలు, మతాలు అంటూ ఎందుకు విద్వేషాలు అని విమర్శించారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ప్రజలందరి కోసం ఉద్దేశించినవి. బీజేపీ, జెడీఎస్​ ఈ పథకాల నుంచి లబ్ది పొందట్లేదా అని ప్రశ్నించారు.

సమాజాన్ని విభజించకూడదు

సమాజంలో చర్చిలు, దేవాలయాలు, మసీదులు ఉండాలని కన్నడ కవి కువెంపు అన్నారు. మతం లేదా కులం ఆధారంగా ప్రజలను విభజించకూడదన్నారు. అలాగే దసరా ఏ ఒక్కరి పండుగ కాదని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని మాట్లాడారు. మరి దివాళా తీసిందా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఈ పథకాల వలన ప్రతి పేదవాడి ప్రయోజనం కలిగిందని, దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. అలాగే ఈ పథకాలను వ్యతిరేకించిన వారు ఇతర రాష్ట్రాల్లో కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక తలసరి ఆదాయం పెరిగిందని, దేశంలోనే రాష్ట్రం నంబర్​ వన్ స్థానంలో ఉందని కొనియాడారు.

చాముండేశ్వరీ పిలుపుతోనే ఇక్కడి వచ్చాను

దసరా ఉత్సవాలను చాముండి కొండలపై దసరా ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం బాను ముస్తాక్​ మాట్లాడారు. ఆ తల్లి ఆశీస్సులతో ఈ రోజు ఉత్సవాలను ప్రారంభించానని గర్వంగా చెప్పారు. గతంలో నా స్నేహితురాలు నన్ను ఇక్కడికి తీసుకొస్తానని చెప్పింది. కానీ తల్లి చాముండేశ్వరీయే నన్ను ఇక్కడికి పిలిచింది. ఇక్కడ కొంత మంది నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ తల్లి నన్ను పిలిచి, ఆశీర్వదించిందని, ఇంతకంటే గొప్ప గౌరవం ఎక్కడైనా ఉంటుందా అని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే దసరా గురించి మాట్లాడుతూ ఈ పండుగ కర్ణాటక సంస్కృతిని, ఐక్యతకు నిదర్శమని, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. మైసూర్​ ను పాలించిన 25వ మహారాజైన జయచామరాజేంద్ర వడయార్​ ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు అన్ని వర్గాలను ఆదరించారని, పాలనలో భాగంగా అందరినీ ఆయన ఆస్థానంలో నియమించారని గుర్తుచేశారు. మాకు తెలిసిన కొంతమంది ముస్లింలు కూడా ఆయన సైన్యంలో పని చేశారని తెలిపారు. అలాగే 24వ మహారాజు కృష్ణరాజ వడయార్​ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని, ఎప్పుడూ వివక్ష చూపలేదని తెలియజేశారు. నా మతం కూడా నాకు మానవ విలువలు, ఇతరులతో ఓ సామరస్యంగా ఉండమని, శాంతియుతంగా జీవించమని బోధించింది. కర్ణాటక అన్ని వర్గాలకు శాంతితోట అని, ఇక్కిడి పువ్వులు ఐక్యతతో వికసించాలని ఆకాంక్షించారు. మనం ఒకరికొకరం గౌరవంగా బతుకుదాం. ఇక్కడ ద్వేషం నశించి, శాంతి, సహనం వర్ధిల్లాలని అన్నారు. ఇక్కడ వెలిగించిన మానవత దీపం ప్రపంచం మొత్తం ప్రకాశించాలని బానుముస్తాక్​ అన్నారు. హిందూ మతంతో నాకున్న అనుబంధం గురించి త్వరలో రానున్న నా ఆత్మకథలో కూడా రాశాను. ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు సీఎం సిద్ధరామయ్యకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆమె అతిథిగా రావడాన్ని వ్యతిరేకించి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు ​ కొట్టేసింది.

దసరా ఏ ఒక్క మతానికి చెందింది కాదు - Tholi Paluku