
దసరా ఉత్సవాలకు.. లైన్ క్లియర్
దసరా ఉత్సవాలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ వేడుకలకు బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ ను ఆహ్వనించడంతో బీజేపీ మండిపడింది. వేరే మతానికి చెందిన వారిని ఉత్సవాలను ప్రారంభించడానికి అతిథిగా ఎలా ఆహ్వానిస్తారంటూ హైకోర్టు లో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ప్రతాప్ సింహతో పాటు నలుగురు పిల్ దాఖలు చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి విభుభక్రు, సీఎం జోషితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు అంగీకరించలేదు. ఈ పిల్ ను నిరాకరించింది. వేరే మత విశ్వాసాలు కలిగిన వ్యక్తిని ఆహ్వనించడ చట్ట, రాజ్యాంగ ఉల్లంఘనగా తాము భావించడం లేదని ఈసందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో బాను ముస్తాక్ ముఖ్య అతిథిగా ఉన్న అడ్డంకి తొలగిపోయింది.
డిస్మిస్ చేయండి
ప్రభుత్వం ముందుగా అతిథిగా ఎవరిని ఆహ్వానించాలనే విషయం పై ఏర్పాటు చేసిన కమిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ కే.శశికిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. దసరా పండుగ అని, ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దాదాపు 11 రోజుల పాటు మైసూర్ లో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
