
దసరా మహోత్సవాలు సూపర్ సక్సెస్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చినా ఎక్కడా ఎటువంటి తోపులాట లేదు. వేలాదిమంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు అమ్మవారి మీద భక్తితత్వంతో.. ఎంతో ఓర్పుతో.. మరెంతో సహనంతో.. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవలు అందించి ఉత్సవాలను ఘనవిజయం చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు.. వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో అంకితభావంతో విధులు నిర్వహించిన ఉద్యోగుల పనితీరు భక్తులు అభినందిస్తున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలపై అమ్మవారి భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొనసాగుతున్న రద్దీ
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2న ముగిసినప్పటికీ ఆదివారం నాటికి భవానీ భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో భవానీలకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయమై ఈవో శీనా నాయక్, నూతన ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, తగు చర్యలు తీసుకున్నారు.
సమర్థవంతమైన పర్యవేక్షణ
ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భవానీల రద్దీని అదుపు చేయడానికి ఇంద్రకీలాద్రిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వన్‌టౌన్ నుంచి భక్తులను కొద్దికొద్దిగా కొండపైకి అనుమతించారు. తద్వారా క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భవానీలు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
భక్తుల కోసం సేవా కార్యక్రమాలు
కనకదుర్గమ్మ దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ భవానీలతో మాట్లాడి, ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారికి బిస్కెట్లు, పాలు పంపిణీ చేసి, అమ్మవారిని దర్శించుకునేందుకు సహకరించారు. దీంతో దేవస్థానం చేసిన ఏర్పాట్లపై భవానీలు సంతోషం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంతో దేవస్థానం అధికారులు, సిబ్బంది సంతృప్తి చెందారు. ప్రత్యేకించి కృష్ణానదిలో వరదల కారణంగా రద్దు అయిన తెప్పోత్సవం మినహా, అన్ని కార్యక్రమాలు శాంతియుతంగా, విజయవంతంగా ముగిశాయని తెలిపారు.
