
దసరా పండుగ
దసరా అంటే.. సరదా పండుగ. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే మరీ సరదా సరదా పండుగ. పిల్లలకు సరదానిచ్చే ఏ సందర్భమైనా పెద్దలకు కూడా సరదా పండుగనే. అందుకే దసరా అనగానే పెద్దల్లో నాటి బాల్య సంగతులు కూడా గుర్తొస్తాయి. నాటి దసరా పండగ సందర్భాల్ని మననం చేసుకునే సందర్భమూ దక్కుతోంది. అసలు ఏ పండుగైనా మనందరి బాల్యాన్ని గుర్తుకు తెచ్చే ఓ అపురూపమే.
అయితే ప్రతి పండుగ సందర్భానికి ఓ నేపథ్యం ఉంటుంది. అంతకుమించి సంప్రదాయం ఉంటుంది. అంతేకాదు, మనం తరతరాలుగా ఆచరించే ఓ విశ్వాసం ఉంటుంది. సామూహిక ఆనందాన్నిచ్చే ఓ పురాతన పడికట్టూ ఉంటుంది. అంతిమంగా ఆ పండుగ, పబ్బానికి పురాణ, ఇతిహాసాలు, చారిత్రక కథనాలూ ముడిపడి ఉంటాయి. అలాంటి విశేషమైన, దేశం మొత్తం జరుపుకునే పండుగే దసరా మహోత్సవం.
దసరా వచ్చే.. సరదా తెచ్చే!
ముందే చెప్పుకున్నట్టు, దసరా అంటే పూర్తీగా పిల్లల పండుగ. పిల్లలకు బడి ఎంత ముఖ్యమో.. ఆ బడికి బోల్డన్ని సెలవులు వచ్చే సందర్భాలు కూడా అంతే ఆనందాన్నిస్తాయి. అందుకే దసరా అంటే పిల్లలకు బోల్డంత సరదా. విద్యాసంవత్సరంలో వేసవి సెలవుల్ని మినహాయిస్తే ఎక్కువ కాలంగా బడికి సెలవులిచ్చేది దసరా పండగ సందర్భంలోనే. పిల్లలకు సెలవులంటే.. అది వారికి ఇష్టమైన ఆటపాటల సమయం. అంతేకాదు, తమ ఎంతో ఇష్టమైన బంధువులు, స్నేహితుల ఊర్లకు వెళ్ళేందుకు అనువైన సమయం. పిల్లల వంకతో పెద్దలు కూడా వారితో జతకట్టి ఇష్టమైన ప్రదేశాలు, బంధువుల ఊర్లకు పర్యటించేందుకు అనువైన సమయం. అంతేకాదు, దసరా అంటే అన్ని వర్గాలకు అంతో ఇంతో సంతోషంగా, సరదాగా, కుటుంబ సమేతంగా సరదగా, ఉల్లాసంగా గడిపే సమయమనే చెప్పాలి. అందుకే, దసరా పండుగ ఓ బాల్యాన్ని వెనక్కి తెచ్చే ఓ అనందమైన పండుగ.
ఎంతటి శోభ, ఎన్నెన్ని వైవిధ్యాలు
ఒక పక్క.. నవరాత్రి ప్రవేశించగానే వాడవాడలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడం మనందరికీ అనుభవమే. శవన్నవరాత్రులన్నన్నీ రోజులూ.. రోజుకొక ప్రత్యేకమే. అమ్మవారి ప్రత్యేక అలంకారంలానే నవరాత్రి మండపాన రోజుకొక సాంస్కృతిక వైభవ ప్రదర్శనలే మనకు గుర్తుకొస్తుంటాయి. హరికథలు, బుర్రకథలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు, సంగీత కచేరీలు, కోలాటాలు, చెక్కభజనలు, పులి వేషాలు, చిన్నారుల చిట్టి పొట్టి వేషధారనలు, అమ్మవారి కాళీకామాత నృత్యవిన్యాసాలు ఇలా చెప్పుకుంటూ పోతే నవరాత్రుల వేళ ఎన్నెన్ని సాంస్కృతిక వైవిధ్యాలను మనం కళ్ళారా చూశాం. అవన్నీ చెరగని ముద్రల్లా మన మనసులో అలానే ఉన్నాయి. ఇక ఇంటింటికీ వచ్చి.. పడీ పడీ నవ్వించే పిట్టల దొర మాటలు, కోతలు కోటలు దాటిన వైనాలు మనం మర్చిపోగలమా?
దసరా చందా.. ఆ సామాజిక కరచాలనం
మానవ జీవితమంటేనే సంఘ జీవనం. ఒకరి వల్ల ఒకరు, ఒకరి సహాయంతో మరొకరు ఇలా ఎవరి దైనందిన జీవితమైనా కలిసి మెలిసి కొనసాగాల్సిందే. అలా మనకు ప్రత్యక్షంగానో, పరోక్ష్యంగానో సాయపడే వారికి కృతజ్ఞత తెలియజేసే సందర్భం కూడా దసరానే. సమాజంలో అలాంటి పౌర సేవల్లో ఉండే ప్రతి ఒక్కరినీ వారి సేవల్ని గుర్తించి, గౌరవించే సందర్భం ఇది. చిన్నతనంలో మనకు ఉత్తరం అందించే పోస్ట్ మ్యాన్, మన ఊరుని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు, బడి గంటకొట్టే వెంకయ్య, స్కూల్ బయట సాగే జీళ్ళు అమ్మే సుబ్బమ్మ, ఆయమ్మ ఇలా అందరికీ ప్రేమగా మనం దసరా చందా ఇచ్చిన నాటి అందమైన సందర్భాలూ ఇప్పటికీ మన గుండెల్లో పదిలమనే చెప్పాలి. ఇలా దసరా అంటే తరగనన్ని సరదా జ్ఞాపకాలు.
ఆధ్యాత్మిక నేపథ్యం:
మనం చిన్నపట్టి దసరా సందర్భాన్ని అవలోకనం చేసుకునే ముందు, దసరా పండుగకు సంబంధించి ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం. పండితులు చెప్పే వివరాలు ప్రకారం, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా అని చెబుతారు పండుగ విశిష్టత తెలిసిన పెద్దలు.
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. అందుకే, ఈ పది రోజుల పండుగని ‘నవరాత్రి వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతంగా ప్రాముఖ్యత చెందిందనే విషయం మనకు తెలిసిందే. .
తొమ్మది రోజులు.. తొమ్మిది అలంకారాలు.. పది విశేషాలు:
తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము. జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది జగన్మాత. ఇలా మన ఇంట తొమ్మిది, పదిరోజులూ అమ్మవారిని తలచుకునే అపూర్వ, ఆధ్యాత్మిక సందర్భాలన్నీ మనలో ఆధ్యాత్మిక చింతన కలిగేందుకు దోహదపడతాయనే చెప్పాలి.
అలంకారినికో.. విశేషం:
దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు. అందుకే, ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా స్మరిద్ధాం!
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!**!
పండుగలన్నీ కాలగమనంలో వాణిజ్యపు సందర్భంగానే మిగిలిపోతున్న కాలంలో దసరా ఎప్పటికీ నిత్యనూతనమే. ఒక తరానికి మరొక తరానికీ మధ్య వారధుల్లా నిలిచేవి పండుగలే. సామూహిక జనజీవనంలో మనుషుల మధ్య సమైక్యతక, ఆప్యాతయ, అనుబంధాలు అంతో ఇంతో మిగిలే ఉన్నాయనడానికి పండుగలు కూడా ఒక కారణమే.
