
దసరా నాటికి 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి: మంత్రి పొంగులేటి
గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం.. పట్టణ పేదలకు కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వడంపై దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ టవర్స్’ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడంతో పాటు పొదుపు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష వరకు అడ్వాన్స్ రుణం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా రాలేదు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని పొంగులేటి ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు గ్రామీణ ప్రాంతాల్లో లక్షలు, రెండు లక్షల ఇళ్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు కలిసి తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని కోరినా ఇప్పటివరకు ఆశించిన స్పందన రాలేదని పేర్కొన్నారు.
దసరా నాటికి 2 లక్షల ఇళ్లు
తొలి విడతలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి సభలో తెలిపారు. ఇందులో 3,75,750 ఇళ్లకు కలెక్టర్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారని, 3,28,070 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు 1,97,537 ఇళ్లు పూర్తయ్యాయని, దసరా నాటికి 2 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఈ నెల 20లోగా రెండో విడత
రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 చొప్పున 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పొంగులేటి తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసినప్పటికీ వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లకు ఈ విడతలో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 20లోగా రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
రూ.230కే సిమెంట్.. త్వరలో రాయితీపై స్టీల్
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ బస్తాను రూ.230కే రాయితీపై సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి స్టీల్ పరిశ్రమల యజమానులతో సమావేశమై, పేదలకు రాయితీపై స్టీల్ అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అసంపూర్తిగా ఉన్న 2బీహెచ్‌కే ఇళ్ల పూర్తి
గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన అసంపూర్తిగా ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని.. అది ఆత్మగౌరవానికి ప్రతీక అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గుడిసె లేని తెలంగాణను నిర్మించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
