
దసరా ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు
దసరా సెలవుల హడావిడి ప్రారంభమైంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వేల సంఖ్యలో ప్రయాణాలు కట్టడంతో ఒక్కసారిగా బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు పండుగ కోసం సొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని, లగేజ్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు.
బస్సులు బస్టాండ్‌లకు వచ్చీరాగానే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. సీట్ల కోసం బస్సు కిటికిల్లో నుంచి బ్యాగులు, పిల్లలను ఎక్కించడం కనిపించింది. ప్రభుత్వం చొరవ చూపించి మరిన్ని బస్సులను, రైళ్లను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ అవి ఇంకా సరిపడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రైవేట్ ట్రావెల్స్ దందా
దసరా రష్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు సిద్ధమైపోయాయి. ప్రైవేట్ బస్సు నిర్వాహకులు ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల ఛార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ వెహికల్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ అయితే దొరికిందే సందు అనుకుని, ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ట్రాఫిక్ నరకం
దసరా పండుగ సందర్భంగా నగరవాసులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లడంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలు కూడా భారీగా రోడ్ల మీదకు రావడంతో విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శనివారం సాయంత్రం నుంచి రద్దీ
దసరా సెలవులు ప్రారంభం కావడంతో శనివారం సాయంత్రం నుంచి బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. వేల సంఖ్యలో జనం సొంత ఊర్లకు ప్రయాణం కట్టడంతో బస్సుల్లో రైళ్లలో సీట్లు అందుబాటులో లేకుండా పోయాయి. రిజర్వేషన్లు అన్ని ఎప్పుడో అయిపోవటంతో నిలబడే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది.
