Let's talk: editor@tmv.in
దసరా ఉత్సవాల్లో ఉత్సాహంగా సేవలు

దసరా ఉత్సవాల్లో ఉత్సాహంగా సేవలు

FL - SUNL
1 అక్టోబర్, 2025

విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులలో అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నుంచే కాక దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు అవసరమైన సేవలందించడానికి దేవస్థానం, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పలు ఏర్పాట్లు చేశాయి. చిన్నారులకు వేడి పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. రద్దీగా ఉండే క్యూలైన్లలో ప్రతి ఒక్కరికి అందేలా విశేష కృషి చేస్తున్నారు. మొదటి ఎనిమిది రోజులలో 1,75,000 బిస్కెట్ ప్యాకెట్లను, మూడు లక్షల అరవై వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 6,600 లీటర్ల పాలను 70 వేల కప్పుల ద్వారా భక్తులకు అందించారు.

భక్తులకు 8 రోజులలో 35 లక్షల మంచినీటి సీసాలు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనంలో ఇబ్బందులు కలగకుండా బ్యాటరీ కార్లు, చక్రాల కుర్చీలు ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం తో పాటు వందలాదిమంది సేవకులు స్వచ్ఛందంగా రేయింబవళ్లు భక్తులకు సేవలందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే రెడ్ క్రాస్ సంస్థ రోజుకు మూడు షిఫ్టుల్లో వృద్ధులకు, దివ్యాంగులకు సేవలందిస్తోంది. అటు పోలీసు యంత్రాంగం "సేవాదళ్" పేరిట ఒక బృందాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సాయపడుతోంది. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ భక్తులకు పాలు అందించడంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. లిటిల్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన "శక్తి సేవ" వాలంటీర్లు దేవాలయంలోని వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు.

నగరపాలక సంస్థ కు చెందిన 1490 మంది పారిశుద్ధ్య కార్మికులు వివిధ ప్రాంతాలలో సేవలందిస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని మరుగుదొడ్ల ను పరిశుభ్రంగా ఉంచుతూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. రేయింబవళ్లు అలుపెరగకుండా అందిస్తున్న సేవలపై భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

దసరా ఉత్సవాల్లో ఉత్సాహంగా సేవలు - Tholi Paluku