Let's talk: editor@tmv.in
దసరాను తలపించిన ఆదివారం భక్తుల రద్దీ

దసరాను తలపించిన ఆదివారం భక్తుల రద్దీ

FL - SUNL
13 అక్టోబర్, 2025

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికే సుమారు 90 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ముగిసే సమయానికి భక్తుల సంఖ్య 1.25 లక్షల నుండి 1.30 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) శీనా నాయక్ ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కొండపైకి కాలినడకన వచ్చి, ప్రసాదం కౌంటర్లను తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీ కంట్రోల్ ద్వారా అన్ని కోణాల్లో రద్దీని, ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తక్షణమే అన్ని టిక్కెట్ల రద్దు భక్తులందరికీ సజావుగా దర్శనం కల్పించేందుకు తక్షణమే అన్ని ప్రత్యేక దర్శన టిక్కెట్లను రద్దు చేసి, క్యూలైన్లను సామాన్య భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

పర్యవేక్షణ: రద్దీ నియంత్రణ, తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నదానం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.సిబ్బందికి దిశానిర్దేశం: ఆలయ భద్రతా సిబ్బంది, ఎస్‌పిఎఫ్ పోలీసులు అవుట్ పోస్ట్ డ్యూటీ పోలీసు సిబ్బందికి తగు మార్గదర్శకాలు ఇచ్చి, క్యూలైన్లను క్రమబద్ధీకరించారు.

ఈవో సమర్థవంతమైన చర్యల ఫలితంగా రద్దీ నియంత్రణలోకి వచ్చి, భక్తుల దర్శనాలు సజావుగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్‌ఛార్జ్ డీసీపీ రామకృష్ణ పాలుపంచుకుని ఈవో తో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు.అనంతరం, ఆలయ ఛైర్మన్ బొప్పన రాధాకృష్ణ ఈవో శీనా నాయక్ తో కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు.

దసరాను తలపించిన ఆదివారం భక్తుల రద్దీ - Tholi Paluku