Let's talk: editor@tmv.in
దేశ నిర్మాణంలో విశ్వకర్మలే కీలకం

దేశ నిర్మాణంలో విశ్వకర్మలే కీలకం

Venkatesh Balusula
18 సెప్టెంబర్, 2025

దేశ నిర్మాణంలో విశ్వకర్మలు కీలమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఉద్దండురాయునిపాలెంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ యాగం అనంతరం నిర్వహించిన సభలో మాధవ్ మాట్లాడారు. ప్రధాని మోడీ సహకారంతో ఏపీకి గొప్ప రాజధాని నిర్మాణం అవుతుందన్నారు. ప్రధాని పవిత్ర ప్రదేశాల నుంచి మట్టి, నీరు తీసుకొని వచ్చారని, అదే మన సాంప్రదాయమని, ఆ భగవంతుడి ఆశీస్సులతోనే అమరావతి నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

మూలాలు మర్చిపోతున్న భారతీయులు

ప్రపంచమంతా విశ్వకర్మ జయంతిని నిర్వహించుకోవాలని, సృష్టిని అందంగా మలిచిన విశ్వకర్మను గౌరవించడం మన బాధ్యత అని మాధవ్ పేర్కొన్నారు. భారతీయులు తమ మూలాలను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వాణిజ్యంలో 14వ శతాబ్దంలో 40 శాతం భారతదేశం నుంచే జరిగేదన్నారు. బ్రిటిషర్లు వెళ్లిపోతూ భారతదేశాన్ని అత్యంత పేద దేశంగా మార్చేశారని తెలిపారు. సర్వ ప్రాణులు భగవంతుడి స్వరూపాలేనని, పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలియకుండా ప్రయాణం చేశారని, మన పైన, మన సంపద పైనా దాడి చేశారని విమర్శించారు. దేవాలయాల నిర్మాణంలో అతి ముఖ్యమైన వారు విశ్వబ్రాహ్మణులేనని, కొందరు ఆధిపత్యం కోసం విశ్వబ్రాహ్మణులను దూరం చేశారని చెప్పారు. గోత్రాల ఆధారంగా అందరూ ఋషులు, మునుల పరంపర విశ్వకర్మల నైపుణ్యం తెలుసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో అనేకమంది రిజిష్టర్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో విశ్వకర్మ విగ్రహం పెడతామని చెప్పారు.

మోడీతో భారతీయ ఉత్పత్తులకు ఖ్యాతి

రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారన్నారు. విశ్వబ్రాహ్మణులు సామాజిక వివక్షతకు గురయ్యారన్నారు. ఆర్ఎస్ఎస్ దేశ అస్తిత్వాన్ని, మూలాలను సరి చేస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాను ప్రవేశపెట్టి భారతీయ ఉత్పత్తులకు ఖ్యాతిని తీసుకొచ్చారన్నారు. స్కిల్ ఇండియా ద్వారా సాంకేతిక పరిజ్ఞానం తోడయ్యేలా చేశారని తెలిపారు. విశ్వకర్మ యోజన ద్వారా విశ్వబ్రాహ్మణ కులాల అస్తిత్వం తీసుకొస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, శివస్వామి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ కృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ర శివన్నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ మీడియా ఇంఛార్జి కిలారు దిలీప్, ఛీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బాపట్ల జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు, ఆవుల నాగేంద్ర, పాండవ శర్మ, బీఎస్ఆర్కే పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

దేశ నిర్మాణంలో విశ్వకర్మలే కీలకం - Tholi Paluku