Let's talk: editor@tmv.in
దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఏపీ వక్ఫ్ బోర్డుకు చేరిన వేలాది కీలక రికార్డులు

దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఏపీ వక్ఫ్ బోర్డుకు చేరిన వేలాది కీలక రికార్డులు

Gaddamidi Naveen
19 జులై, 2026

రాష్ట్ర విభజన తర్వాత దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. ఏపీ వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వద్ద దశాబ్ద కాలంగా భద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వేలాది కీలక రికార్డులను ఎట్టకేలకు అధికారికంగా ఏపీ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది.

తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి ఏపీకి చెందిన 79 బండిళ్లలోని 3,503 ఫైళ్లు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజెట్ సంపుటాలు, ఇతర అత్యంత విలువైన చారిత్రాత్మక రికార్డులు ఏపీ బోర్డుకు బదిలీ అయ్యాయి. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఇది కేవలం రికార్డుల బదిలీ కాదని, వక్ఫ్ ఆస్తుల హక్కులను పరిరక్షించే కీలక ఆధారాలు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి లభించిన విజయమని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో వక్ఫ్ ఆస్తుల రక్షణ, ఆక్రమణల తొలగింపు, యాజమాన్య హక్కుల నిర్ధారణ, కోర్టు కేసుల నిర్వహణ వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. రికార్డులతో పాటు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ. 55 కోట్ల రూపాయల బకాయిలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.

పట్టుదలతో సాధించిన విజయం

తాము బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, నిరంతర అనుసరణ, పట్టుదలతోనే ఈ లక్ష్యాన్ని సాధించామని చైర్మన్ తెలిపారు. దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ఈ సమస్య పరిష్కారానికి పూర్తి సహకారం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఎన్.ఎం.డి. ఫరూక్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెద్దమనసుతో సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్‌లు
APWaqfBoardWaqfBoardAndhraPradeshAmaravatiWaqfPropertiesWaqfRecordsSheikhAbdulAzizAPNewsAndhraNewsWaqfAssetsPropertyRightsGovernance
దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఏపీ వక్ఫ్ బోర్డుకు చేరిన వేలాది కీలక రికార్డులు - Tholi Paluku