Let's talk: editor@tmv.in
దేశద్రోహులకు కాంగ్రెస్ అండ

దేశద్రోహులకు కాంగ్రెస్ అండ

Aravind Maryada Reddy
15 సెప్టెంబర్, 2025

ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఆయన ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేకశక్తులకు మద్దతు ఇస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. నెహ్రూ విధానాలతోనే ఈశాన్య రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తున్నదని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకు నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యతిరేక ఆలోచన విధానం ఆపరేషన్ సిందూర్ సమయంలోనే బయటపడిందని విమర్శించారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాదులకు బుద్ధి చెబితే .. కాంగ్రెస్ పార్టీ మాత్రం దాయాది దేశానికి మద్దతు పలికిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆదివారం అస్సాం దరంగ్ జిల్లాలోని మంగల్డోయ్లో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎమ్ పాఠశాలలు ఉన్నాయి. బహిరంగ సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. '1962లో చైనాతో యుద్ధం తర్వాత నెహ్రూ ఈశాన్య ప్రజలకు చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. కాంగ్రెస్ ఆ గాయాలపై ఉప్పు చల్లుతోంది' అని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదులకు మద్దతిచ్చిందని, దేశ వ్యతిరేకులకు రక్షణ కవచమైందని విమర్శించారు. అలాగే, గాయకుడు భూపెన్ హజారికాకు భారతరత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ అవమానించిందని, తాను శివభక్తుడినని, విషాన్ని గొంతులో దాచుకుంటానని చెప్పారు. ప్రధాని మణిపూర్ పర్యటన వివాదాస్పదమైంది. 2023 మే నుంచి మైటీ-కుకి వర్గాల మధ్య జరుగుతున్న జాతి వివాదాల్లో 269 మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మోదీ మొదటిసారిగా శనివారం మణిపూర్కు వెళ్లి, చురాచంద్పూర్, ఇంఫాల్లలో రూ.7,300 కోట్ల విలువైన వికాస ప్రాజెక్టులు ప్రారంభించారు. బాధితులతో సమావేశమై, 'మణిపూర్లో ఏదైనా హింస అసహ్యకరం. శాంతి, పునరావాసం కోసం కేంద్రం కట్టుబడి ఉంది' అని అప్పీల్ చేశారు. బాధితులు సురక్షిత ప్రయాణం, ఉద్యోగాలు, న్యాయం కోరారు. అయితే, పర్యటన సమయంలో పోలీసులు శాంతియుత నిరసనలపై దాడి చేయడం, మీడియా బ్లాకౌట్ ఆరోపణలు వచ్చాయి.

మోడీ పర్యటనపై విమర్శలు

కాంగ్రెస్ ఈ పర్యటనలను విమర్శిస్తోంది. ప్రధాని ఆలస్యంగా మేల్కొన్నారని అభివర్ణిస్తోంది. మోదీ మణిపూర్ పర్యటన అవమానకరం అని కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ మూడుసార్లు మణిపూర్ సందర్శించారని, మోదీ ఎందుకు ఇంత ఆలస్యం చేశారని ప్రశ్నించారు. అస్సాం కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ.. ప్రధాని కేవలం ఆర్భాటం కోసం పర్యటించారని విమర్శించారు. మణిపూర్లో ఆయన శాంతి నెలకొల్పకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మణిపూర్లో మోదీ పర్యటనకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. బీజేపీ నేతలు మోడీని అభినిందిస్తుండగా..విపక్షాలు కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ పర్యటనలు బీజేపీకి ఈశాన్యంలో బలం పెంచడానికి ఉపయోగపడతాయి. అస్సాంలో కాంగ్రెస్పై దాడి ఎన్నికల దృష్టితోనే అని విశ్లేషకులు చెబుతున్నారు. మణిపూర్లో హింసను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు ఉన్నాయి. మోదీ విజిట్లు మణిపూర్లో 8 సార్లు (మన్మోహన్ 3 సార్లు) అని సమర్థకులు చెబుతున్నారు. అయితే, హింస తర్వాత 28 నెలలు ఆలస్యం ఎందుకని ప్రశ్నలు. ఈశాన్యంలో వోట్ బ్యాంక్ రాజకీయాలు రాష్ట్రాలను నష్టపరిచాయని మోదీ విమర్శించారు. మొత్తంగా, మోదీ పర్యటనలు వికాసానికి ఊపిరి పోసినా, రాజకీయ వివాదాలు, మణిపూర్ హింసలు శాంతి ప్రక్రియను సవాలు చేస్తున్నాయి. కేంద్రం హామీలను అమలు చేస్తోందా.. లేదా అనేది భవిష్యత్లో తేలనున్నది.

ఫొటో రైటప్: అసోం రాష్ట్రంలోని* *దరంగ్ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ

దేశద్రోహులకు కాంగ్రెస్ అండ - Tholi Paluku