Let's talk: editor@tmv.in
దళిత బాలుడికి న్యాయం చేయాలి

దళిత బాలుడికి న్యాయం చేయాలి

Pinjari Chand
7 అక్టోబర్, 2025

సిమ్లాలోని రోహ్రు ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతుంది. కులవివక్ష కారణంగా ఓ దళిత మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో హిమాచల్ ప్రదేశ్ అంతటా ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దళిత బాలుడికి న్యాయం చేయాలని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్స్కిస్ట్​), స్థానికులు, దళిత సంఘాలు సోమవారం ఫ్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సమాజంలోని బలహీన వర్గాలను రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు.

ఇంకా కుల వివక్షనా?

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఇంకా సమాజంలో కుల వివక్ష సంఘటనలు జరుగుతుండడం చాలా సిగ్గుచేటు, దురదృష్టకరం అని నిరసనకు నాయకత్వం వహించిన సీపీఐఎం నాయకులు రాకేష్ సింఘా (మాజీ ఎమ్మెల్యే), సంజయ్ చౌహాన్ విచారం వ్యక్త చేశారు.

దేశంలో నేటికీ కుల ఆధారిత వివక్ష అమాయక జీవితాలను నిరాశలోకి నెట్టివేస్తుండటం చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. రోహ్రు సంఘటన కేవలం ఒక వ్యక్తికి చెందిన విషాదం కాదు. ఇది మన సమాజం ఎదుర్కోంటున్న తీవ్రమైన సామాజిక వివక్షను ప్రతిబింబిస్తుందన్నారు. దళిత మైనర్ బాలుడిని నిత్యం కులం ఆధారంగా వివక్ష చూపుతూ, అవమానాలకు గురి చేశారని, దీంతో ఆ బాలుడు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అయితే కొంతమంది న్యాయం కొరే బదులు, ఆ బాలుడికి దొంగతనం చేసే అలవాటుందని ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది ఎంతమాత్రం తగదన్నారు. దొంగ అని చెబుతూ ఈ వివక్షను, ఘటనను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రాకేష్​ సింఘా అన్నారు. అయితే ఆ బాలుడి పై ఎలాంటి ఎఫ్ఐఆర్​ ఇప్పటి వరకు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుల సమస్య నుంచి దృష్టి మళ్లించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణమైన ప్రయత్నం, క్రూరమైన మనస్తత్వం కలవారే ఇంకా కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే అని ఆయన అన్నారు. రోహ్రు కేసుకు, ఇటీవల కులులో జరిగిన సంఘటనకు మధ్య పోలికలు ఉన్నాయని సీపీఐఎం అనుమానం వ్యక్తం చేసింది. అలాగే న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

దళిత బాలుడికి న్యాయం చేయాలి - Tholi Paluku