
దళితులపై వేధింపులు పెరిగాయి: వైఎస్సార్సీపీ
బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై దాడులు, వేధింపులు పెరిగాయని ఆరోపించారు. దళిత మహిళలపై నడిరోడ్డుపై దౌర్జన్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు.
కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ కోసం దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సబ్‌ప్లాన్‌ను అమలు చేశారని, ప్రస్తుతం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి కూడా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
స్పీకర్ ఘటనపై విమర్శలు
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న దళితుడిని చెంపదెబ్బ కొట్టిన ఘటన ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులు సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు.
జగ్జీవన్‌రామ్ సేవల స్మరణ
ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా ఆధునిక భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మహానేత అని అన్నారు. ఆయన 33 సంవత్సరాలపాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను నిర్వహిస్తూ దేశానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ స్వాతంత్ర్యానికి ముందు నుంచే అసమానతలు, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై పోరాడిన నాయకుడని తెలిపారు. దేశంలో రైల్వే, వ్యవసాయం, కార్మిక, రక్షణ వంటి కీలక శాఖలను సమర్థంగా నిర్వహించిన పరిపాలనాదక్షుడిగా ఆయన నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
