Let's talk: editor@tmv.in
దళపతి విజయ్ వర్సెస్ బాబీ డియోల్ 'జన్ నేత' ధమాకా!

దళపతి విజయ్ వర్సెస్ బాబీ డియోల్ 'జన్ నేత' ధమాకా!

Gaddamidi Naveen
24 డిసెంబర్, 2025

దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'జన నాయగన్' హిందీ టైటిల్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను హిందీలో 'జన్ నేత' అనే పేరుతో విడుదల చేయబోతున్నారు.హిందీలో 'జన్ నేత' అంటే "ప్రజల నాయకుడు" అని అర్థం. విజయ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో, ఈ పొలిటికల్ టైటిల్ ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా భారీ వ్యూహంతో నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఉత్తర భారత మార్కెట్‌లో ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ విడుదల చేయనుంది. సినిమా విడుదల తేదీగా 2026 జనవరి 9ను ఖరారు చేశారు.

ఈ సందర్భంగా దళపతి విజయ్‌తో పాటు నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ శక్తివంతమైన లుక్‌లో, బాబీ డియోల్ తీవ్రతను ప్రతిబింబించే పాత్రలో దర్శనమివ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.విజయ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కలిసి కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఈ చిత్రంలో బలమైన నటీనటుల బృందం కనిపించనుంది. హీరోయిన్‌గా పూజా హెగ్డే, మమిత బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నరైన్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం సమకాలీన అంశాలను స్పృశిస్తూ, ప్రేక్షకులను ఆలోచింపజేసే కథనంతో ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాణ బాధ్యతలను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. సహ నిర్మాతలుగా జగదీశ్ పాలనిస్వామి, లోహిత్ ఎన్.కే. వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.

మకర సంక్రాంతి , పొంగల్ పండుగల వీకెండ్కు అనుగుణంగా జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రం, దక్షిణ భారతంతో పాటు ఉత్తర భారత ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే భారీ చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.