
దళపతి విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? తమిళనాడులో ఉత్కంఠ
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. దళపతి విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) పార్టీ 2026 ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో విజయ్ అరంగేట్రం ఎక్కడి నుంచి ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన మనసులో మాట బయటపెట్టకపోయినా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు.
పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రధాన పేరు చెంగల్పట్టు. ఇక్కడ మాదకద్రవ్యాల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు పాత పార్టీల పాలనతో విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటివరకు డీఎంకే అన్నాడీఎంకే పార్టీలకు అవకాశం ఇచ్చినా పెద్దగా మార్పు రాలేదని అందుకే విజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే జనం బ్రహ్మరథం పడతారని వారు నమ్ముతున్నారు.
మరికొందరు నాయకులు మాత్రం విజయ్‌కు సిటీల్లో ఉన్న క్రేజ్‌ను వాడుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న పెరంబూర్, విరుగంబాక్కం వంటి నియోజకవర్గాల్లో విజయ్ అభిమాన గణం ఓట్ల వర్షం కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే తాంబరం, పల్లవరం వంటి శివారు ప్రాంతాలు కూడా విజయ్‌కు సేఫ్ జోన్ అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే రాజకీయంగా గట్టి సందేశం ఇవ్వాలంటే దక్షిణ తమిళనాడుకు గుండెకాయ లాంటి మదురై నుంచి బరిలోకి దిగాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు. గతంలో మదురైలో విజయ్ నిర్వహించిన సభలకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూస్తే అక్కడ ఆయన విజయం నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కార్యకర్తలు రకరకాల నియోజకవర్గాల పేర్లు చెబుతున్నా అంతిమ నిర్ణయం మాత్రం విజయ్ చేతిలోనే ఉంది. 2026 ఎన్నికల్లో విజయ్ వేసే ఈ తొలి అడుగు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.
