
దభోల్కర్ హత్య కేసులో దోషికి బెయిల్.. జీవిత ఖైదు నిలిపివేత
హేతువాది, సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సచిన్ అంధురేకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అలాగే 2024లో ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష అమలుపై స్టే విధించింది. నరేంద్ర దభోల్కర్‌ను 2013 ఆగస్టు 20న పుణెలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కాల్చి చంపారు. ఈ కేసులో 2024లో పూనే ప్రత్యేక కోర్టు సచిన్ అంధురే, శరద్ కలస్కర్‌లను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు, ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. అదే సమయంలో కీలక నిందితుడిగా ఉన్న వీరేంద్రసింహ్ తావ్డే సహా సంజీవ్ పునాలేకర్, విక్రమ్ భావేలను తగిన ఆధారాలు లేవన్న కారణంతో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి
పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన నరేంద్ర దభోల్కర్ మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేశారు. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి (ఎంఏఎన్‌ఎస్)ను స్థాపించారు. అద్భుతాలు చేస్తామని చెప్పుకునే వ్యక్తుల వాదనలను ఆయన తరచూ ప్రశ్నించేవారు. ఆయన ఆధ్వర్యంలో ఎంఏఎన్‌ఎస్ రూపొందించిన ‘యాంటీ-జాదూ టోనా బిల్’ (మూఢనమ్మకాలు, చేతబడికి వ్యతిరేక బిల్లు) 2013లో చట్టంగా మారింది. దభోల్కర్ హత్య కేసును తొలుత పూనే పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం బాంబే హైకోర్టు ఆదేశాలతో 2014లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సనాతన్ సంస్థతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ తావ్డేను 2016 జూన్‌లో సీబీఐ అరెస్టు చేసింది. దభోల్కర్ సంస్థ కార్యకలాపాలను సనాతన్ సంస్థ వ్యతిరేకించేదని, హత్యకు తావ్డే కీలక సూత్రధారి అని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కోర్టులో నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.
