
దత్తత తీసుకున్న తల్లులకు సుప్రీం పెద్ద ఊరట
ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దత్తత తల్లుల ప్రసూతి సెలవులపై ఉన్న పరిమితిని తొలగిస్తూ భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు వెలువరించింది. దత్తత తీసుకున్న శిశువు వయస్సు 3 నెలలలోపు ఉండాలనే నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. న్యాయమూర్తులు జేబీ.పర్దీవాలా, ఆర్.మహాదేవన్‌ల బెంచ్, సామాజిక భద్రత కోడ్–2020లోని సెక్షన్ 60(4) ఆర్టికల్స్ 14, 21లకు విరుద్ధమని తేల్చింది. ఇకపై శిశువు వయస్సుతో సంబంధం లేకుండా దత్తత తల్లులకు 12 వారాల ప్రసూతి సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. మాతృత్వం అనేది కేవలం ప్రసవంతో మాత్రమే సంబంధం లేకుండా, పిల్లల సంరక్షణ, బాధ్యతలతో కూడిన భావన అని కోర్టు పేర్కొంది. దత్తత కూడా ప్రసవ స్వేచ్ఛలో భాగమని, సహజ తల్లి–దత్తత తల్లి మధ్య హక్కుల్లో తేడా ఉండకూడదని స్పష్టం చేసింది. శిశువు వయస్సు ఆధారంగా హక్కులను పరిమితం చేయడం అన్యాయమని తెలిపింది. దత్తత ప్రక్రియలో భావోద్వేగ, మానసిక సవాళ్లు శిశువు వయస్సుతో సంబంధం లేకుండా ఒకేలా ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా దివ్యాంగుల పిల్లలు లేదా ఒంటరి తల్లుల సందర్భాల్లో ఈ అవసరం మరింత ముఖ్యమని పేర్కొంది. ఈ కేసును దత్తత తల్లి అయిన న్యాయవాది నండూరి హంసనందిని దాఖలు చేశారు. ప్రసూతి సెలవులు మహిళల సమానత్వానికి, తల్లి–శిశు ఆరోగ్యానికి అవసరమైన ప్రాథమిక హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. అలాగే పితృత్వ సెలవులను కూడా సామాజిక భద్రతలో భాగంగా గుర్తించాలని కేంద్రానికి సూచించింది.
ఇండస్ట్రీ’ నిర్వచనంపై పునఃసమీక్ష.. 1978 తీర్పును తిరిగి పరిశీలించనున్న సుప్రీంకోర్టు
‘ఇండస్ట్రీ’ అనే పదానికి ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్, 1978లో వచ్చిన బెంగుళూర్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కేసు తీర్పు సరైనదేనా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆ తీర్పులో న్యాయమూర్తి వీఆర్.కృష్ణ అయ్యర్ రూపొందించిన ‘ట్రిపుల్ టెస్ట్’ ద్వారా ‘ఇండస్ట్రీ’ నిర్వచనాన్ని విస్తరించారు. దీని వల్ల ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సేవా సంస్థలు కూడా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం కోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న ఈ విస్తృత నిర్వచనం అవసరానికి మించినదా? ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాలను కూడా ఇండస్ట్రీగా పరిగణించడం సరైనదేనా? అన్నదే.
అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలో ట్రిపుల్ టెస్ట్ సిద్ధాంతపరంగా సరైనదే అయినా, అమలులో అతిగా విస్తరించిందని తెలిపారు. జస్టిస్ బీవీ నాగరత్న, ప్రస్తుత పరిస్థితుల్లో లిబరలైజేషన్ తర్వాత కొత్త సమతుల్యత అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసు రిఫరెన్స్ విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విచారణలో 1982 చట్టం లేదా 2020 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌ను పరిగణలోకి తీసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు మూలం బెంగళూరు వాటర్ సప్లై బోర్డు ఉద్యోగుల వివాదంతో మొదలై, చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ కొనసాగుతుందని, తదుపరి వాదనలు త్వరలోనే జరగనున్నాయి.
