Let's talk: editor@tmv.in
దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమం

దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమం

Panthagani Anusha
3 జనవరి, 2026

నెల్లూరు జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన 'దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ' నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దామవరం గ్రామంలోని 418.14 ఎకరాల శాశ్వత లీజు భూములను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌)కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగా భూసేకరణ వ్యయాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. శాశ్వత లీజు దారులకు ఎకరాకు రూ. 13 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నారు. అయితే లీజు హక్కుల బదిలీ జరిగిన చోట, అసలు లీజుదారులు లేదా వారి వారసులకు 35 శాతం, హక్కులను కొనుగోలు చేసిన వారికి 65 శాతం చొప్పున పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకు అయ్యే రూ. 54.35 కోట్ల మొత్తాన్ని ఏపీఏడీసీఎల్‌ తన సొంత నిధుల నుంచే భరించనుంది. దామవరం సర్వే నంబర్ 1/1లోని ఈ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

విమానాశ్రయ అభివృద్ధిని మొత్తం మూడు దశలుగా విభజించారు. తొలి దశ పనులను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద రూ. 916 కోట్లతో చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల పాటు అమలులో ఉండేలా రాయితీ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రయాణికుల రద్దీ, కార్గో (సరుకు రవాణా) అవసరాలకు అనుగుణంగా ప్రతి 15 ఏళ్లకు ఒకసారి వసతుల విస్తరణ చేపట్టేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.

దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కేవలం నెల్లూరు జిల్లాకే కాకుండా పొరుగున ఉన్న కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలకు, పరిశ్రమలకు చాలా వరకు ప్రయోజనం కలగనుంది. ప్రయాణికుల రవాణాతో పాటు పారిశ్రామిక సరుకు రవాణాకు (కార్గో) ఇది కీలక కేంద్రంగా మారనుంది. ముఖ్యంగా జిల్లాలోని పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక రంగం అభివృద్ధిలో ఈ విమానాశ్రయం గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమం - Tholi Paluku