Let's talk: editor@tmv.in
దక్షిణ 24 పరగణాలో అగ్నిప్రమాదం

దక్షిణ 24 పరగణాలో అగ్నిప్రమాదం

Pinjari Chand
28 జనవరి, 2026

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పక్కపక్కనే ఉన్న రెండు గోదాముల్లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, మరికొంతమంది కార్మికులు ఇంకా లోపలే చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగి 24 గంటలకు పైగా గడిచినా గోదాముల్లోని కొన్ని భాగాల్లో మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. కోల్‌కతా నగర శివార్లలోని నజీరాబాద్‌ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే 12 అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. దాదాపు ఏడు గంటల కష్టపడ్డ తర్వాత మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చినప్పటికీ, కాలిపోయిన గోదాముల వివిధ అంతస్తుల్లో ఇంకా మంటలు చెలరేగిపోతున్నాయని అధికారులు తెలిపారు.

డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నాం

సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో తీవ్రంగా కాలిపోయిన మూడు మృతదేహాలను వెలికితీయగా, అనంతరం మరో ఐదు మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. కాలిన మృతదేహాలు, ఎముకల అవశేషాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదాముల్లో డెకరేషన్‌ కంపెనీతో పాటు ప్రముఖ మోమో చైన్‌కు చెందిన యూనిట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పనిచేసే కార్మికులు కొందరు గోదాముల లోపలే తాత్కాలిక గదుల్లో నివసిస్తున్నారని, అందువల్ల గల్లంతైన వారి సంఖ్య 10 మందికి మించవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతులు, గల్లంతైనవారంతా తూర్పు మేదినీపూర్‌, పశ్చిమ మేదినీపూర్‌, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు చెందిన వారేనని అధికారులు తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు సాధ్యం కావడం లేదని, అందువల్ల బంధువుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి గుర్తింపు నిర్ధారించనున్నట్లు అగ్నిమాపక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రాథమికంగా ఆరుగురు గల్లంతయ్యారని సమాచారం వచ్చినప్పటికీ, లోపల చిక్కుకున్న వారి సంఖ్య 10 మందికి మించవచ్చని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.

రాష్ట్ర అగ్నిమాపక సేవల మంత్రి సుజిత్‌ బోస్‌ మాట్లాడుతూ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మిగిలిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే వరకు బృందాలు అక్కడే మోహరించి ఉంటాయని తెలిపారు. రాత్రి వేళ సహాయక చర్యల కోసం హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. అగ్నిప్రమాదాల నివారణకు ఏడాదికి రెండుసార్లు ఫైర్‌ ఆడిట్‌ నిర్వహించినప్పటికీ, నిబంధనలను పాటించాల్సిన బాధ్యత యజమానులదేనని మంత్రి వ్యాఖ్యానించారు.