
దక్షిణ సూడాన్ భారీ స్కెచ్: అమెరికాతో దౌత్య బేరం!
అమెరికా నుండి బహిష్కరణకు గురైన వారిని (డిపోర్టీలను) తమ దేశానికి రప్పించుకునేందుకు అంగీకరించిన దక్షిణ సూడాన్, దీనిని ఒక దౌత్యపరమైన బేరసారంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. తమ అగ్రశ్రేణి అధికారులపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, అలాగే ప్రతిపక్ష నేతలపై విచారణకు సహకరించాలని ఆ దేశం అమెరికాను కోరినట్లు తాజాగా బయటపడిన దౌత్య పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏమిటీ ఒప్పందం?
గత జూలైలో అమెరికా నుండి బహిష్కరించబడిన వివిధ దేశాల పౌరులను స్వీకరించిన మొదటి ఆఫ్రికా దేశంగా దక్షిణ సూడాన్ నిలిచింది. వీరిలో మెక్సికో, క్యూబా, వియత్నాం వంటి దేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే, ఈ ప్రక్రియ వెనుక దక్షిణ సూడాన్ ప్రభుత్వం అమెరికా ముందు పలు కీలక డిమాండ్లను ఉంచింది.
దక్షిణ సూడాన్ ప్రధాన డిమాండ్లు:
బిలియన్ డాలర్ల ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉపాధ్యక్షుడు బెంజమిన్ బోల్ మెల్ పై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలని కోరింది. జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రియెక్ మాచర్ పై కొనసాగుతున్న దేశద్రోహం, హత్య కేసుల విచారణకు వాషింగ్టన్ మద్దతు ఇవ్వాలని కోరింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా దక్షిణ సూడాన్ చమురు కంపెనీలపై ఉన్న ఆంక్షలను తొలగించి, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేసింది.
విమర్శలు, మానవ హక్కుల ఆందోళన:
దక్షిణ సూడాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. స్వదేశీ పౌరులకే కనీస వసతులు కల్పించలేని దక్షిణ సూడాన్, అమెరికా ఇచ్చే నిధుల కోసం ఇతర దేశాల బహిష్కృతులను స్వీకరించి, దేశాన్ని ఒక 'డపింగ్ గ్రౌండ్'లా మారుస్తోందని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, రియెక్ మాచర్‌పై విచారణను రాజకీయ కక్షసాధింపు చర్యగా వారు అభివర్ణిస్తున్నారు.
అంతర్యుద్ధం దిశగా ..
ప్రస్తుతం దక్షిణ సూడాన్ తీవ్రమైన రాజకీయ, భద్రతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2018 శాంతి ఒప్పందం విఫలమవ్వడంతో, అధ్యక్షుడు సల్వా కీర్, ప్రతిపక్ష నేత రియెక్ మాచర్ మధ్య విభేదాలు మళ్లీ ముదిరాయి. మాచర్ గృహ నిర్బంధంలో ఉండటం, జోంగ్లీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ దళాలు, సాయుధ గ్రూపుల మధ్య భీకర పోరు జరగడం వల్ల దేశం మరోసారి అంతర్యుద్ధం అంచుకు చేరుకుంది. కేవలం గత నెలలోనే దాదాపు 1.8 లక్షల మంది ప్రజలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వలస వెళ్లగా, పౌరులపై దాడులు, హింస విపరీతంగా పెరగడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు, ఆ దేశం మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక పతనానికి, కరువుకు గురవుతోంది. స్థానిక కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడికి అందనంత భారంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందకపోవడం, దేశ జనాభాలో దాదాపు 70% మంది ఆకలితో అలమటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాంటి విపత్కర సమయంలో అవినీతి ఆరోపణల వల్ల అమెరికా వంటి దేశాలు మానవతా సహాయాన్ని తగ్గించడం దక్షిణ సూడాన్ భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెట్టేస్తోంది.
ఇంతటి భారీ బేరసారాలు నడిచినప్పటికీ, అమెరికా-దక్షిణ సూడాన్ మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు. మానవతా దృక్పథంతో చేసే సహాయ కార్యక్రమాలపై దక్షిణ సూడాన్ ప్రభుత్వం అదనపు ఫీజులు వసూలు చేయడాన్ని అమెరికా తప్పుబట్టింది. ఈ పద్ధతి కొనసాగితే ఆ దేశానికి ఇచ్చే భారీ ఆర్థిక సహాయంలో కోత విధిస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.
ప్రస్తుతం ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కాకుండా, మళ్లీ అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తుండటం గమనార్హం.
