Let's talk: editor@tmv.in
దక్షిణ సూడాన్‌లో బంగారు గని వద్ద కాల్పులు.. 70 మంది మృతి!

దక్షిణ సూడాన్‌లో బంగారు గని వద్ద కాల్పులు.. 70 మంది మృతి!

Shaik Mohammad Shaffee
31 మార్చి, 2026

ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ దేశంలో ఒక బంగారు గని విషయంలో తలెత్తిన గొడవ ఘోర నరమేధానికి దారితీసింది. రాజధాని జుబా సమీపంలోని ఒక గని ఎవరికి చెందాలనే విషయంలో జరిగిన చిన్న వివాదం చివరకు పెద్ద కాల్పుల యుద్ధంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా జరిపిన ఈ కాల్పుల్లో 70 మందికి పైగా అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గని వద్ద పనిచేస్తున్న కూలీలు భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారని, ఈ విషాద ఘటన నిజమేనని అక్కడి పోలీసులు తెలిపారు.

వివాదాల నిలయంగా జెబెల్ ఇరాక్ గని

సెంట్రల్ ఈక్వటోరియా రాష్ట్రంలోని జెబెల్ ఇరాక్ వద్ద ఉన్న ఈ బంగారు గని గత కొంతకాలంగా హింసాత్మక ఘటనలకు వేదికవుతోంది. ఇక్కడ చట్టవిరుద్ధంగా గనులను తవ్వే మైనింగ్ మాఫియాకు, గుర్తింపు పొందిన మైనింగ్ కంపెనీలకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడి భీభత్సానికి అద్దం పడుతోంది.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

దాడి జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది కార్మికులు సమీపంలోని పొదల్లోకి, అడవిలోకి పారిపోయినట్లు స్థానిక జర్నలిస్టులు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రస్తుతానికి 70 మృతదేహాలను గుర్తించినప్పటికీ, అడవిలోకి పారిపోయిన వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. అయితే ఈ దారుణాన్ని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ దళాలే దీనికి కారణమని ఆరోపించింది.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. "గుర్తుతెలియని సాయుధులు జెబెల్ ఇరాక్ గనిపై దాడి చేశారని మాత్రమే మాకు తెలుసు. పూర్తి వివరాలు అందిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తాం" అని స్థానిక పోలీసులు తెలిపారు. దేశంలో నెలకొన్న అంతర్గత రాజకీయ విభేదాలు, సహజ వనరుల కోసం సాగుతున్న పోరాటం సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటుండటంతో అంతర్జాతీయ సమాజం విచారం వ్యక్తం చేస్తోంది.