

దక్షిణ రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గవు: ప్రధాని మోడీ
జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణ భారత రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గించబోమని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం లోక్‌సభ స్థానాలను పెంచే చర్యలు తీసుకుంటామని, దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కేరళంలో జరిగిన ఎన్డీయే ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన దక్షిణ రాష్ట్రాలు సీట్లను కోల్పోతాయనే ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. లోక్‌సభ సీట్ల పునర్విభజనలో ఆ రాష్ట్రాలకు నష్టం జరగకుండా పార్లమెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను పెంచే ప్రతిపాదనపై పార్లమెంట్‌లో చర్చ జరగనుందని మోడీ తెలిపారు. మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైన చట్టసవరణలపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలను ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పొడిగించినట్లు చెప్పారు. జనాభా నియంత్రణలో ముందున్న కేరళం, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాలు సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు.
ఇటీవల లోక్‌సభ సీట్ల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దక్షిణ రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మోడీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ రిజర్వేషన్ 2029 నుంచి అమలులోకి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, మహిళల పేర్లపై ఇళ్లు నిర్మించడం, జనధన్ ఖాతాలు తెరవడం, శౌచాలయాల నిర్మాణం వంటి పథకాల ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపర్చామని తెలిపారు. అలాగే ముద్రా రుణాల ద్వారా స్వయం ఉపాధి ప్రారంభిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ‘లఖ్‌పతి దీది’ వంటి కార్యక్రమాలు మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతున్నాయని ప్రధాని చెప్పారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలతో విదేశాల్లో భారతీయుల ప్రాణాలకు ముప్పు
పశ్చిమాసియా అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ‘ప్రేరేపక వ్యాఖ్యలు’ అక్కడ ఉన్న భారతీయుల భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. సభలో మాట్లాడుతూ ఎన్నికలు వస్తుంటాయి-పోతుంటాయి కానీ విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత తనకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కేరళంకు చెందిన లక్షలాది మంది భారతీయుల భద్రతను ప్రభుత్వం కచ్చితంగా కాపాడుతుందని తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు, అలాగే ఇరాన్ సహా కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
అయితే కాంగ్రెస్ నాయకులు భారత్-పశ్చిమాసియా దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. రాజకీయ లాభం కోసం తనపై దాడి చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన ఆరోపించారు.
ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి గడువు ప్రారంభమైందని ప్రధాని అన్నారు. త్వరలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళం అభివృద్ధికి గణనీయంగా నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కాలంతో పోలిస్తే కేరళం అభివృద్ధికి ఐదింతలు ఎక్కువగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. అలాగే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ఒకదానిపై మరొకటి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నాయని, కానీ వాస్తవానికి ఆ రెండు కూటములు ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సభ చివరలో కేరళ ప్రజలకు ఈస్టర్, విషు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
