Let's talk: editor@tmv.in
దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్‌ బూస్ట్‌.. మౌలిక సదుపాయాలకు రూ.13,026 కోట్లు

దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్‌ బూస్ట్‌.. మౌలిక సదుపాయాలకు రూ.13,026 కోట్లు

Panthagani Anusha
5 ఏప్రిల్, 2026

భారతీయ రైల్వేలో కీలకమైన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌)) జోన్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు జరిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ జోన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.13,026 కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.11,012 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 18.3 శాతం అధికం కావడం విశేషం. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, వేగవంతమైన రవాణా సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా ఈ భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.

కాగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక వాటాను ట్రాక్ డబ్లింగ్ పనులకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం నిధుల్లో రూ.5,083 కోట్లను డబ్లింగ్ పనులకు, రూ.1,315 కోట్లను కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేటాయించారు. అదేవిదంగా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ట్రాక్ పునరుద్ధరణ కోసం రూ.1,908 కోట్లు, రోడ్డు భద్రత (ఆర్వోబీ/ఆర్యూబీ) పనులకు రూ.683 కోట్లు, ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదలకు రూ.403 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు కొత్త మార్గాలకు బీజం పడనుంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌సీఆర్ జోన్ సాధించిన పురోగతిని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో 194 కిలోమీటర్ల మేర ట్రాక్ అభివృద్ధి పనులు పూర్తి కావడం విశేషం. ఇందులో మల్లవరం–కనిగిరి మధ్య 36 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త లైన్ ప్రధానమైంది. అదేవిదంగా పణ్యం–నంద్యాల, బాసర–నవీపేట్, కాజీపేట బైపాస్ ప్రాంతాల్లో డబ్లింగ్ పనులను పూర్తి చేసి రైళ్ల రాకపోకలను సులభతరం చేశారు. తాండూర్, పెద్దపల్లి ప్రాంతాల్లో ‘వై’ కనెక్టివిటీ, బైపాస్ లైన్ల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించారు.

మరోవైపు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన గ్రాండ్ ట్రంక్ మార్గంలో (గూడూరు–విజయవాడ–కాజీపేట్–బాల్హర్షా) మూడో లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 700 కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తి కావడంతో ప్రయాణికులు, సరకు రవాణా రైళ్ల వేగం పుంజుకోనుంది. దీంతో పాటు బాల్హర్షా–మనిక్గఢ్, మహబూబాబాద్–నెక్కొండ, ఖమ్మం–దోర్నకల్ వంటి కీలక మార్గాల్లో ట్రిప్లింగ్ పనులు పూర్తి చేసి, 325 కిలోమీటర్ల మేర విద్యుతీకరణను కూడా పూర్తి చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాజీపేట్, వాడి, పెద్దపల్లి వంటి జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న బైపాస్ లైన్లు రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా తాండూర్ వద్ద ఏర్పాటు చేసిన ‘వై’ కనెక్టివిటీ ముంబై మార్గంలో సరకు రవాణాను మరింత వేగవంతం చేయనుంది. ఈ భారీ బడ్జెట్ కేటాయింపులతో అటు గ్రామీణ ప్రాంతాలకు రైల్వే నెట్‌వర్క్ విస్తరించడమే కాకుండా ఇటు పారిశ్రామిక రవాణాకు కూడా ఊతం లభించనుంది.