Let's talk: editor@tmv.in
దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళ దారుణ హత్య

దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళ దారుణ హత్య

Pinjari Chand
14 అక్టోబర్, 2025

దక్షిణ ఢిల్లీ మునిర్కా ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మృతిచెందింది. అలాగే ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, మునిర్కా గల్లీ నం.1లో ఒక జంట మధ్య గొడవ జరిగిందని పోలీస్​ కంట్రోల్ రూమ్​ కు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే కిషన్‌గఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి ప్రధాన తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉండటంతో బలవంతంగా తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే బాత్‌రూమ్‌లో ఇద్దరు రక్తపు మడుగులో పడిఉండటాన్ని పోలీసులు గమనించారు. వారిని ఇద్దరినీ ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు.యువతి మెడ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండడంతో, తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడే మరణించినట్లు వైద్యులు తెలిపారు. యువకుడికి కూడా మెడకు గాయమై తీవ్రంగా గాయపడ్డాడు.అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనాస్థలంలో పోలీసులు ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

మూడేళ్లుగా సహజీవనం

మరణించిన ఆమెను థెంపి ఖోంగ్‌సైగా గుర్తించారు.ఈమె దక్షిణ ఢిల్లీలోని మునిర్కా గ్రామంలో నివసిస్తున్నారు. ఈమెది సేనాపతి జిల్లా, మణిపూర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో ఆమె బ్యూటీషియన్‌గా పని చేస్తుండేది. గాయపడిన వ్యక్తి థాంగ్జమ్ వినీ మైతేయి కూడా మునిర్కా గ్రామానికి చెందినవ్యక్తే. బాబా బేకరీ దగ్గర కిరాణా షాప్ నడిపుతూ జీవనం సాగిస్తుంటాడు. అయితే విచారణలో ఈ జంట దాదాపు మూడు సంవత్సరాలుగా కలిసి నివసిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. శనివారం రాత్రి గొడవ జరిగిన తర్వాత ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గొడవ సమయంలో ఆ మహిళ తన తండ్రికి ఫోన్ చేసి వివరాలు తెలిపింది. ఆందోళనతో తండ్రి వారి ఇంటి యజమానిని సంప్రదించాడు. తరువాత ఇంటి యజమాని కుమార్తె 112కి ఫోన్ చేసి అత్యవసర పరిస్థితిని పోలీసులకు తెలియజేసింది.

క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేసి ఆధారాలను సేకరించారు. పోలీసులు, ఈ ఘటనలో చట్టపరమైన వివరాలను పొందుపరుస్తున్నామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గృహహింస కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందని భావిస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళ దారుణ హత్య - Tholi Paluku