Let's talk: editor@tmv.in
దక్షిణ కొరియానే మా ప్రధాన శత్రువు: కిమ్ సంచలన ప్రకటన

దక్షిణ కొరియానే మా ప్రధాన శత్రువు: కిమ్ సంచలన ప్రకటన

Shaik Mohammad Shaffee
25 మార్చి, 2026

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య యుద్ధ భయం మళ్లీ మొదలైంది. దక్షిణ కొరియా తమకు అత్యంత పెద్ద శత్రువు అని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (పార్లమెంటు) మొదటి సెషన్‌లో ప్రసంగిస్తూ.. ఇకపై ఆ దేశంతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని, రెండు దేశాలు ఒక్కటయ్యే అవకాశం కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ దక్షిణ కొరియా గనుక తమపై కన్నెత్తి చూసినా లేదా తమ భూభాగంలోకి రావాలని చూసినా ఏమాత్రం దయ లేకుండా భారీ దెబ్బ కొడతామని కిమ్ హెచ్చరించారు.

అణుశక్తి విషయంలో రాజీ లేదు

ఉత్తరకొరియా అణు సామర్థ్యంపై కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా దేశం అణ్వాయుధ దేశంగా మారిపోయింది, దీనిని ఎవరూ మార్చలేరు' అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ప్యాకేజీలు లేదా భద్రతా హామీల కోసం అణ్వాయుధాలను వదిలేసే ప్రసక్తి లేదని కిమ్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఉండబట్టే దేశం అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతోందని ఆయన వాదించారు. ఏకపక్ష శక్తితో ఇతర దేశాల హక్కులను కాలరాస్తున్న ప్రస్తుత ప్రపంచంలో, దేశ మనుగడకు అణ్వాయుధాలే నిజమైన గ్యారెంటీ అని ఆయన పేర్కొన్నారు.

అమెరికాపై నిప్పులు.. రష్యా నుంచి మద్దతు

ప్రాంతీయ అస్థిరతకు అమెరికానే కారణమని కిమ్ మండిపడ్డారు. కొరియా ద్వీపకల్పం వద్ద వ్యూహాత్మక అణు ఆస్తులను మోహరించడం ద్వారా వాషింగ్టన్ ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ఇరాన్ వంటి దేశాలపై అమెరికా చేస్తున్న దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అణ్వాయుధాలు లేకపోతే శత్రువుల జోక్యం పెరుగుతుందని విశ్లేషించారు. కాగా ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందన సందేశం పంపడం విశేషం. కిమ్ నాయకత్వాన్ని ప్రశంసించిన పుతిన్, మాస్కో-ప్యాంగ్యాంగ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

భారీగా రక్షణ బడ్జెట్.. ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక

దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, రక్షణ రంగానికి ఉత్తరకొరియా పెద్దపీట వేసింది. 2026 బడ్జెట్‌లో మొత్తం వ్యయంలో 15.8 శాతాన్ని రక్షణ రంగం కోసం కేటాయించారు. ఈ నిధులను ప్రధానంగా అణు నిరోధక శక్తిని పెంచడానికి, యుద్ధ సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగిస్తారు. పరిశ్రమల ఆధునీకరణ, విద్యుత్, బొగ్గు ఉత్పత్తి పెంపు, ఆహార భద్రత, గృహ నిర్మాణాలపై దృష్టి సారించే కొత్త ఐదేళ్ల ప్రణాళికను పార్లమెంటు ఆమోదించింది. దక్షిణ కొరియాను శత్రు దేశంగా గుర్తిస్తూ రాజ్యాంగంలో మార్పులు చేసే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కిమ్ వ్యాఖ్యలపై దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. శాంతియుత సహజీవనానికి ఇటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం శ్రేయస్కరం కావని, కేవలం చర్చల ద్వారానే భద్రత సాధ్యమని సియోల్ పేర్కొంది.