Let's talk: editor@tmv.in
దక్షిణాసియా శాంతికి కశ్మీరే కీలకం.. పాక్ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

దక్షిణాసియా శాంతికి కశ్మీరే కీలకం.. పాక్ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ భారత్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. పాక్ పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కశ్మీరీలకు స్వేచ్ఛ లభించే వరకు దక్షిణాసియాలో ఎవరూ సురక్షితంగా ఉండలేరు" అంటూ ఆయన రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. కశ్మీర్ ప్రజలకు తమ దేశం తరఫున దౌత్య, నైతిక మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొంటూ తన పాత రాగాన్నే మళ్ళీ అందుకున్నారు.

సింధు జలాల నిలిపివేతపై ‘జల’ విమర్శలు

భారత్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ జర్దారీ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం 'జల ఉగ్రవాదం' వంటిదని ఆయన అభివర్ణించారు. నీటి ప్రవాహాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా వాడుకోవడం సరికాదని భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీటితో పాటు స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని, 1967 నాటి సరిహద్దులతో కూడిన పాలస్తీనా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు.

అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాదం.. పొరుగు దేశాలకు హెచ్చరిక

పాకిస్థాన్‌ను అస్థిరపరిచేందుకు పొరుగు దేశాల గడ్డను వేదికగా చేసుకుంటే ఊరుకునేది లేదని జర్దారీ హెచ్చరించారు. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద బృందాల ఉనికి ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి నివేదిక సైతం హెచ్చరించిందని గుర్తు చేశారు. అఫ్గాన్ పాలకులు ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ, తమ దేశ శాంతిని దెబ్బతీసేందుకు ఏ విదేశీ శక్తినైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. ఇరాన్ నేత అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు సంతాపం ప్రకటించారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.

సభలో హోరెత్తిన నిరసనలు: ‘గో జర్దారీ గో’

జర్దారీ ప్రసంగం అంతా విపక్షాల నినాదాల మధ్యే సాగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు సభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. "గో జర్దారీ గో", "ఖాన్ కో రిహా కరో" (ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయండి) అంటూ ప్లకార్డులతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్యే జర్దారీ తన ప్రసంగాన్ని పూర్తి చేశా రు. అధ్యక్షుడిగా ఉమ్మడి సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ఇది 9వ సారి.