


దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
వస్త్ర పరిశ్రమ రంగంలో తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే అత్యుత్తమ టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేసి, పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
భారతదేశానికి వస్త్ర తయారీలో గొప్ప చరిత్ర ఉందని, నిజాం కాలం నుండే హైదరాబాద్ ముత్యాలు, వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ డీఎన్ఏలోనే టెక్స్‌టైల్స్ ఉంది. దేశంలో నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో మేం అగ్రగామిగా ఉన్నాం. కేవలం పరిశ్రమగానే కాకుండా, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి మా సంస్కృతిలో భాగమయ్యాయని ఆయన వివరించారు.
అద్భుతమైన మౌలిక సదుపాయాలు - మెగా టెక్స్‌టైల్ పార్క్
వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అప్పరెల్ పార్కులు ఉన్నాయని సీఎం తెలిపారు. డీప్‌టెక్, ఫార్మా, ఏరోస్పేస్ వంటి రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని, వస్త్ర పరిశ్రమకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు వంటి సదుపాయాలను వేగంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ విజన్ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పత్తి పొలాల నుంచి తయారైన దుస్తులు లండన్, పారిస్, మిలాన్, టోక్యో వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై మెరవాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు.
సినిమా రంగం, ఫ్యాషన్ హబ్
హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ సినిమా నిర్మాణ కేంద్రంగా మారుతోందని, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ స్టూడియోలు ప్రారంభించాయని సీఎం గుర్తు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ కూడా హైదరాబాద్‌ను తమ కేంద్రంగా చేసుకుంటున్న నేపథ్యంలో, సినిమా రంగానికి కావాల్సిన ఫ్యాషన్ డిజైన్లను కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చేస్తామన్నారు.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ 'గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను' అభివృద్ధి చేస్తామని, యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆధునిక డిజైనింగ్, కట్టింగ్, స్టిచింగ్‌లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయడమే తమ అంతిమ లక్ష్యమని, ఈ 'తెలంగాణ రైజింగ్' ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించి, ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు.
స్వదేశీ మార్కెట్‌పై దృష్టి సారించాలి - మంత్రి శ్రీధర్ బాబు
అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వంటి అంతర్జాతీయ పరిణామాలు వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు లో పాల్గొన్న ఆయన, మారుతున్న గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం తన భారీ స్వదేశీ మార్కెట్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ సవాళ్లు - స్వదేశీ బలం
సుంకాల పెంపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్త్ర పరిశ్రమ మొదటగా ప్రభావితమవుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వంటి దేశాలు సుంకాలు పెంచినప్పుడు ఆ ప్రభావం వెంటనే మన ఎగుమతులపై పడుతుంది. అయితే, భారతదేశానికి 140 కోట్ల జనాభా అనే అతిపెద్ద బలం ఉంది. మన దేశంలోనే వస్త్ర వినియోగం చాలా ఎక్కువగా ఉంది. మన దగ్గర ఉన్న సాంకేతికత, నైపుణ్యం చేనేత కార్మికుల శక్తిని కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2024-25లో భారత వస్త్ర, అప్పరెల్ ఎగుమతులు 37.75 బిలియన్ డాలర్లకు చేరి, 5.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వస్త్ర ఎగుమతుల్లో భారతదేశం 6వ స్థానంలో ఉంది. యూఏఈ (14.5శాతం), జపాన్ (19శాతం), హాంకాంగ్ (69శాతం) వంటి మార్కెట్లలో భారత వస్త్రాలకు మంచి గిరాకీ లభిస్తోంది. పత్తి, పట్టు, ఉన్ని, జూట్ వంటి సహజ నారలతో పాటు మానవ నిర్మిత నారల ఉత్పత్తిలోనూ భారత్ బలంగా ఉంది.
ఉపాధి, ఆధునీకరణ
వస్త్ర పరిశ్రమ అత్యధిక ఉపాధిని కల్పించే రంగమని, దీనిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిశ్రమగా పరిగణిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. మన వారసత్వ సంపదను ఆధునిక ప్రపంచంతో అనుసంధానించేలా సాంకేతిక మార్పులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు, చేనేత కార్మికులు, పెట్టుబడిదారులకు సమతుల్యమైన మద్దతు లభించినప్పుడే ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్ర పరిశ్రమ తన నిర్వచనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
