Let's talk: editor@tmv.in
దక్షిణాఫ్రికా టి20 సిరీస్‌కు గిల్ రీ ఎంట్రీ

దక్షిణాఫ్రికా టి20 సిరీస్‌కు గిల్ రీ ఎంట్రీ

Praveen Kumar
4 డిసెంబర్, 2025

భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మన్ శుభ్మన్ గిల్ పూర్తిగా కోలుకుని, దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 అంతర్జాతీయ సిరీస్‌కు ఉప కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇటీవల మెడ గాయంతో ఆయన గువాహటి టెస్టు, తదనంతరం జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

కొల్కతాలో జరిగిన తొలి టెస్టులో గాయపడిన గిల్‌ను వైద్యులు విశ్రాంతి సూచించడంతో రెండో టెస్టు, వన్డేలన్నింటికీ దూరమవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఫిట్‌నెస్ పరంగా అన్నీ సక్రమంగా ఉంటే ఉప కెప్టెన్ బాధ్యతలు మళ్లీ ఆయనకే అప్పగించనున్నట్లు సమాచారం.

టి20 జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ బుధవారం రాయ్‌పూర్‌లో సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ డిసెంబర్ 9న కటక్‌లో ప్రారంభంకానుంది. టీం ఇండియా టి20 ఫార్మాట్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా, సీనియర్ క్రికెటర్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ,ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య డ్రెస్సింగ్‌రూం వాతావరణం సంబంధించి చర్చ జరగబోతుందన్న వార్తలను బీసీసీఐ వర్గాలు ఖండించాయి. ప్రస్తుతం వన్డేలకే పరిమితమై ఉన్న ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు 2027 వరల్డ్‌కప్ వరకూ ఆడతారా అనే విషయం పై కూడా స్పష్టత లేదని తెలిపాయి.

“సిరీస్ మధ్యలో ఎలాంటి సమావేశం ఉండదు. సిరీస్‌ పూర్తయ్యాక అవసరమైతే అప్పుడే నిర్ణయం తీసుకుంటాం” అని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0–2 తేడాతో పరాజయం పొందింది.