Let's talk: editor@tmv.in
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. తొమ్మిది మంది మృతి

దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. తొమ్మిది మంది మృతి

Shaik Mohammad Shaffee
22 డిసెంబర్, 2025

దక్షిణ ఆఫ్రికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ అనే ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన సామూహిక కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెలలో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఏం జరిగింది?

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో, ఒక లైసెన్స్ కలిగిన మద్యం దుకాణం వద్దకు దుండగులు రెండు వాహనాల్లో వచ్చారు. ఒక తెల్లటి వ్యాన్, ఒక సిల్వర్ రంగు కారులో వచ్చిన సుమారు 12 మంది వ్యక్తులు ఒక్కసారిగా అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బార్ లోపల ఉన్న వారినే కాకుండా, ఆ సమయంలో బయట వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని కూడా వదలకుండా కాల్పులు జరిపి, అక్కడి నుండి పారిపోయారు. క్షణాల్లో జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైపోయింది.

పోలీసుల దర్యాప్తు

ఈ దారుణానికి పాల్పడిన హంతకులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. "అసలు ఈ కాల్పులు ఎవరు జరిపారు? ఎందుకు జరిపారు?" అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. "ఈ కేసును మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం, హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించాం" అని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన 10 మందికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. గతంలో బంగారు గనులకు నిలయమైన ఈ బెకర్స్‌డాల్ ప్రాంతంలో ప్రస్తుతం గనులు మూతపడటంతో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయని, అందుకే ఇలాంటి దారుణమైన నేరాలు జరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భయాందోళనలో ప్రజలు

ఆర్థిక రాజధాని జోహన్నెస్‌బర్గ్‌కు అతి సమీపంలో ఇలాంటి హింసాత్మక ఘటన జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాల్పులకు పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, శాంతి భద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

దేశంలో పెరిగిపోతున్న హింస

దక్షిణ ఆఫ్రికాలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి గణాంకాలను పరిశీలిస్తే అక్కడ సగటున రోజుకు 60 మందికి పైగా హత్యకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 6వ తేదీన కూడా ప్రిటోరియా నగర సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారితో సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రజల భద్రత గాలిలో దీపంలా మారిందని, అసలు సామాన్యులకు రక్షణ ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరస్థులు ఇంతలా రెచ్చిపోతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.