Let's talk: editor@tmv.in
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత మహిళల జట్టు ప్రకటన

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత మహిళల జట్టు ప్రకటన

Shaik Mohammad Shaffee
25 మార్చి, 2026

వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్, మహిళల ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన యువ క్రీడాకారిణి అనుష్క శర్మ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైంది. గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన 22 ఏళ్ల అనుష్క, 7 మ్యాచ్‌ల్లో 129.19 స్ట్రైక్ రేట్‌తో 177 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన ఆమెకు సెలక్టర్లు పట్టం కట్టారు.

కొత్త ముఖాలు.. పాత కలయికలు

ఈ పర్యటన ద్వారా 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ కాశ్వీ గౌతమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ ఉమా ఛెత్రి తిరిగి జట్టులోకి రాగా, ఆస్ట్రేలియాతో జరిగిన గత సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి సత్తా చాటిన అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే గత పర్యటనల్లో ఉన్న వైష్ణవి శర్మ, స్నేహ్ రాణా, జి. కమలిని, అమంజోత్ కౌర్ వంటి ఆటగాళ్లకు ఈసారి చోటు దక్కలేదు. శ్రీలంక సిరీస్‌లో ఆడిన హర్లీన్ డియోల్ పైన కూడా సెలక్టర్లు వేటు వేశారు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ వంటి సీనియర్లతో కూడిన ఈ కొత్త జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

సిరీస్ షెడ్యూల్

ఏప్రిల్ 17న డర్బన్ వేదికగా తొలి టీ20 ప్రారంభం కానుంది. మొదటి రెండు మ్యాచ్‌లు డర్బన్‌లో, తర్వాతి రెండు జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుండగా, చివరి మ్యాచ్ ఏప్రిల్ 27న బెనోనిలో నిర్వహిస్తారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 19 ముఖాముఖి పోరాటాల్లో భారత్ 10 విజయాలతో పైచేయి సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన భారత్, అదే జోరును టీ20ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. జూన్-జూలైలో ఇంగ్లాండ్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా మారనుంది.

భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ