
దక్షిణాఫ్రికా-ఏతో రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ ఓటమి
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో అనధికారిక టెస్టులో (నాలుగు రోజుల మ్యాచ్) సౌత్ ఆఫ్రికా-ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్-ఏను ఓడించింది. అసాధ్యమనుకున్న 417 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన సఫారీ జట్టు, ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ, తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. వికెట్లు పడుతున్నప్పటికీ, యువ ఆటగాడు ధృవ్ జురెల్ అజేయ సెంచరీతో (132 నాటౌట్) గౌరవప్రదమైన స్కోరును అందించాడు. దీనికి సమాధానంగా సౌత్ ఆఫ్రికా-ఏ కూడా భారత పేసర్ల ధాటికి తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్-ఏకు 34 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
34 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్, 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ధృవ్ జురెల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో (127 నాటౌట్) చెలరేగి, ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ నాటౌట్ సెంచరీలు నమోదు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (65), హర్ష్ దూబే (84) అర్ధ సెంచరీలతో రాణించడంతో సౌత్ ఆఫ్రికా-ఏ ముందు 417 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
లక్ష్య ఛేదనలో సఫారీ దూకుడు
ఓవర్‌నైట్ స్కోరు 25/0తో ఆదివారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా-ఏ జట్టు, 392 పరుగులు చేయాల్సిన కఠినమైన సవాలును ధైర్యంగా స్వీకరించి, సమిష్టిగా రాణించింది. అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. సౌత్ ఆఫ్రికా-ఏ జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లు భారత్-ఏ టెస్ట్ బౌలర్లైన మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్‌లను సమర్థంగా ఎదుర్కొన్నారు.
దక్షిణాఫ్రికా ఓపెనర్లు జోర్డాన్ హెర్మాన్ (91), లెసెగో సెనోక్వానే (77) 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, విజయావకాశాలను సజీవంగా ఉంచారు. లంచ్‌కు ముందే వారు 114 పరుగులు చేశారు. కెప్టెన్ టెంబా బావుమా (59), జుబైర్ హమ్జా (77) మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించి జట్టును 300 పరుగుల మార్కు దాటించారు. గాయం కారణంగా సిరాజ్ కొంత సమయం మైదానానికి దూరంగా ఉండటం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారింది. చివర్లో కోనార్ ఎస్టర్‌హుయిజెన్ (52 నాటౌట్) కేవలం 54 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, మరో వికెట్ నష్టం లేకుండానే జట్టును విజయానికి చేర్చాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టును మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 417/5 వద్ద లక్ష్యాన్ని ఛేదించింది. ఇది “ఏ” మ్యాచ్‌ల చరిత్రలో అత్యధిక పరుగుల చేధనగా నిలిచింది.
భారత్-ఏ జట్టులో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు చివరి వరకు పోరాడినప్పటికీ, వారి పోరాటం ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు, సిరాజ్, ఆకాశ్ దీప్, హర్ష్ దూబె తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ సిరీస్‌లోని తొలి అనధికారిక టెస్టులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసిన సఫారీ జట్టు, ఇకపై జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈ వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి మొదలవుతుంది.
