
థ్యాంక్స్ గివింగ్ డే: రెండు టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్ద్ ట్రంప్ శ్వేతసౌధంలో ‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టారు. వాడిల్, గోబుల్ అనే రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ కార్యక్రమం హాస్యం, రాజకీయ విమర్శలతో సరదాగా సాగింది. "గోబుల్! నీకు ఎలాంటి షరతులు లేకుండా నేను క్షమాభిక్ష మంజూరు చేస్తున్నాను" అని ట్రంప్ ఒక పక్షికి చెప్పగా, దానికి బదులుగా అది పెద్దగా అరిచింది.
ఈసారి క్షమాభిక్ష పొందిన 'వాడిల్', 'గోబుల్' ఉత్తర కరోలినా రాష్ట్రానికి చెందినవి. వైట్ హౌస్‌లో కార్యక్రమానికి ముందు, ఈ రెండు పక్షులు ది విల్లార్డ్ ఇంటర్ కాంటినెంటల్ అనే విలాసవంతమైన హోటల్‌లో విడిది చేశాయి.
ఎప్పుడు మొదలైంది?
అమెరికాలో ప్రతి సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ పండుగకు ముందుగా వైట్ హౌస్‌లో టర్కీ పక్షులకు అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రకటించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. పండుగరోజు దేశవ్యాప్తంగా లక్షల టర్కీలు భోజనంగా వడ్డిస్తారు. అయితే ఎంపిక చేసిన రెండు టర్కీలను చంపకుండా జీవించే అవకాశం ఇస్తారు.
ఈ విచిత్రమైన సంప్రదాయం 1863 నాటిది. అప్పటి అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన కొడుకుకు ఇష్టమైన పక్షిని చంపకుండా వదిలేయడంతో ఇది మొదలైనట్లు చెబుతారు. అధికారికంగా మాత్రం 1989లో అధ్యక్షుడు జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ నుంచే ఇది ప్రతీ సంవత్సరం జరుగుతున్న సంప్రదాయంగా మారింది.
రాజకీయ చమత్కారాలు
ట్రంప్ తన ప్రసంగంలో కొంత హాస్యాన్ని, రాజకీయ విమర్శలను జోడించారు. తనకంటే ముందు పనిచేసిన అధ్యక్షుడు జో బైడెన్ ఉపయోగించిన ఆటోపెన్ కారణంగా ఆయన ఇచ్చిన టర్కీ క్షమాభిక్షలు చెల్లవని ట్రంప్ చమత్కరించారు. బైడెన్ క్షమించిన 'పీచ్', 'బ్లాసమ్' అనే రెండు పక్షులను చివరి నిమిషంలో వధించడానికి ముందు తాను రక్షించానని, వాటికి కూడా అధికారికంగా క్షమాభిక్ష ప్రసాదించానని ట్రంప్ ప్రకటించారు.
ఈ టర్కీలను చూసినప్పుడు, వాటికి డెమొక్రాట్ల నాయకులైన చక్ షూమర్, నాన్సీ పెలోసీ పేర్లు పెట్టాలనుకున్నానని ట్రంప్ అన్నారు. "కానీ నేను వారికి ఎప్పటికీ క్షమాభిక్ష ఇవ్వను" అని నవ్వుతూ రాజకీయ వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా ప్రస్తుతం క్షమాభిక్ష పొందిన 'వాడిల్', 'గోబుల్' అనే రెండు టర్కీ కోళ్లు తమ స్వస్థలమైన ఉత్తర కరోలినాకు తిరిగి వెళ్తాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో నవంబర్ 2020లో కూడా టర్కీ క్షమాభిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు కోవిడ్-19 మహమ్మారి మధ్యలో, ఎన్నికల ఓటమి తర్వాత కొర్న్, కోబ్ అనే టర్కీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
ఈ సంప్రదాయాన్ని వైట్ హౌస్ మాత్రమే కాకుండా, అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ రాష్ట్రాలలో కొనసాగిస్తున్నారు. ఆ టర్కీలకు సృజనాత్మకంగా పేర్లు పెట్టడం అనేది ఈ కార్యక్రమంలోని అత్యంత ఆసక్తికరమైన, వినోదాత్మక అంశం.
