Let's talk: editor@tmv.in
థెరపీ కాదు.. బలవంతం

థెరపీ కాదు.. బలవంతం

Unknown
22 అక్టోబర్, 2025

ఎవరు గీశారు ఈ సరిహద్దులు..? ఎందుకు కట్టారు ఈ గోడలు? మేం ఎవరిని ప్రేమించాలో కూడా సమాజమే చెబుతుందా? మా అస్థితత్వం ఏంటో కూడా మీరే నిర్ణయిస్తారా? మా హృదయం ఎలా స్పందించాలో.. మా భావాలు ఎవరిమీద పుడితే సరైందో కూడా మీరే తేలుస్తారా? ఈ ప్రశ్నలన్ని అమెరికా అధ్యక్షుడికే..!! సంధిస్తుంది ఎవరో కాదు.. అక్కడి ఎల్‌జీబీటీ కమ్యూనిటినే! ఎందుకంటే ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వర్గాలను టార్గెట్ చేశారు. అందులో ఎల్‌జీబీటీ కమ్యూనిటి కూడా ఒకటి. ప్రపంచం మారుతోంది కానీ కొంతమంది ఇంకా మనసులను బంధించాలనే చీకటిలోనే నిలబడ్డారు. ట్రంప్ ప్రభుత్వం మళ్లీ కన్వర్షన్ థెరపీ అనే విషాన్ని చిమ్మాలని చూస్తోంది. ఇది సైన్స్‌కి వ్యతిరేకంగా తీసుకోవాలని చూస్తున్న నిర్ణయం. మనం ఎవరో అంగీకరించడమే మనిషితనమని నమ్మే సైన్స్‌ని ట్రంప్‌ సవాల్ చేస్తున్నారు. ఇంతకీ కన్వర్షన్ థెరపీ అంటే ఏంటి?

అసలు కన్వర్షన్ థెరపీ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌జీబీటీ పదాలు అర్థంకావాలి. ఎల్‌జీబీటీ అనేవి నాలుగు అక్షరాలు కాదు.. అది ఒక సజీవ ప్రపంచం. ఎల్‌ ఫర్ లెస్బియన్, జీ ఫర్ గే, బీ ఫర్ బైసెక్సువల్, టీ ఫర్ ట్రాన్స్‌జెండర్. ఇవి మనుషులలో సహజంగా ఉండే ఆకర్షణలు, గుర్తింపులు. ఎవరికైనా తమ జెండర్ లేదా ఆకర్షణ గురించి వేరుగా అనిపిస్తే అది తప్పు కాదు.. అది ప్రకృతిలోని వైవిధ్యం. ఈ వైవిధ్యమే మానవ సౌందర్యమని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు కన్వర్షన్ థెరపీ అనే పద్ధతిని చూద్దాం. పేరు చూస్తే ఇది ఒక చికిత్సలా అనిపిస్తుంది కానీ ఇది చికిత్స కాదు.. ఇది బలవంతం. దీని ఉద్దేశ్యం మనిషి గుర్తింపుని మార్చడం. అంటే గే అయిన వ్యక్తిని స్ట్రైట్‌గా మార్చడం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని తిరిగి తన పుట్టుక జెండర్‌కి కట్టిపడేయడం. ఇది ప్రేమను సరిచేయడం కాదు, మనసును విరిచేయడం.

ఈ థెరపీ చాలా రకాలుగా జరుగుతుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్ పేరుతో వారిని కూర్చోబెట్టి మానసిక ఒత్తిడి పెంచుతారు. 'ఇది తప్పు', 'ఇది పాపం', 'నువ్వు మారాలి' అని పదే పదే చెబుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మరికొన్ని సందర్భాల్లో మందులు ఇస్తారు, హార్మోన్లను మార్చే ప్రయత్నం చేస్తారు. ఎక్కడో ఆధ్యాత్మిక మార్గంలో ప్రార్థనలు చేయమని బలవంతం చేస్తారు. ఇది శాస్త్రానికి, వైద్య నైతికతకు వ్యతిరేకం. శాస్త్రీయంగా చూస్తే మనిషి లింగ ఆకర్షణ అంటే ఒక జీవ రసాయన సమతుల్యం. అది మెదడులో, హార్మోన్లలో, జన్యువుల్లో ఏర్పడే సహజ ప్రక్రియ. దాన్ని మార్చడం అంటే శరీరాన్ని కాదు మనసును నాశనం చేయడం. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం కన్వర్షన్ థెరపీ వల్ల డిప్రెషన్, భయం, ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయి. ఇది ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మానసిక హింస. ఈ థెరపీకి గురైన వారిలో చాలా మంది తమ సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. వారిని సిగ్గు, భయం అనే భావాలు కమ్మేస్తాయి. కానీ ఒక స్థాయికి చేరినప్పుడు వారు తిరిగి లేచి నిలబడతారు. ప్రేమను దాచలేమని, జెండర్‌ని మార్చలేమని, మనసును బంధించలేమని ప్రపంచానికి చెబుతారు. నిజానికి ప్రకృతి ప్రతీ జీవిలో ప్రేమను నింపింది. ఆ ప్రేమకి లింగం ఉండదు, సరిహద్దులు ఉండవు. కన్వర్షన్ థెరపీ ఆ ప్రేమపై వేసిన చీకటి మేఘమనే చెప్పాలి.

ప్రపంచ వైద్య సంస్థలు కన్వర్షన్ థెరపీని మానవ హక్కుల ఉల్లంఘనగా ఎప్పుడో చెప్పాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి తన గుర్తింపుని మార్చాలని బలవంతపెట్టడం ఆరోగ్య పరంగా , మానసికంగా ప్రమాదకరం. ఈ పద్ధతి వైద్యంగా సరైనది కాదు,, ఇది శాస్త్రీయ ఆధారాల్లేని హింసాత్మక ప్రయత్నం. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ కూడా ఇదే చెబుతోంది. కన్వర్షన్ థెరపీ వల్ల యువతలో డిప్రెషన్ పెరుగుతుందని, భయం పెరుగుతుందని, ఆత్మహత్యల శాతం అధికమవుతుందని అధ్యయనాలు స్పష్టంగా చూపుతున్నాయి. నిజమైన థెరపీ అంటే మనసును మార్చడం కాదు, మనసును అంగీకరించడం.

వైద్యులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక నిపుణులు కూడా ఒకే మాట చెబుతున్నారు. ఎల్‌జీబీటీ సమాజం కూడా ప్రకృతి సృష్టిలో భాగమే. ఇది తప్పు కాదు ఇది జీవ శాస్త్రానికి సహజ వైవిధ్యం. మనిషి శరీరంలో ఉన్న హార్మోన్లు, మెదడులో ఉన్న రసాయన సమతుల్యాలు, జన్యువుల్లో ఉన్న ఆకర్షణ పద్ధతులు లాంటివే మనిషి ప్రేమ స్వభావాన్ని నిర్ణయిస్తాయి. వీటిని బలవంతంగా మార్చడం అంటే శరీరంలోని సహజ సమతుల్యాన్ని చెరపడమే. ప్రకృతిని ఒక సైన్సు పుస్తకంగా చదివితే అందులో ప్రతి పేజీ ప్రేమతో నిండి ఉంటుంది. సముద్రంలోని చేపల నుంచి ఆకాశంలోని పక్షుల వరకు ప్రేమకు అనేక రూపాలు కనిపిస్తాయి. గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్ ఆకర్షణలు ప్రకృతి వైవిధ్యానికి సాక్ష్యమని సైన్స్ చెబుతోంది. ఈ వైవిధ్యమే ప్రపంచాన్ని అందంగా ఉంచుతోంది.

ఇక ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన పాలనలో హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్షన్ థెరపీకి దారితీసే విధానాలు పరిశీలిస్తోంది. వారి నివేదికలు లింగ గుర్తింపు చికిత్సలను తగ్గించి తిరిగి ఆత్మ నియంత్రణ పేరుతో పాత పద్ధతులను మళ్లీ ప్రవేశపెట్టాలనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇది ఎల్‌జీబీటీ సమాజానికి ప్రమాద ఘంటిక లాంటిదే. ఒకవేళ ఈ థెరపిని తిరిగి ప్రవేశపెడితే అమెరికా అంతటా నిరసనలు తప్పకపోవచ్చు. మరి చూడాలి ట్రంప్‌ నెక్ట్స్ ఏం చేయనున్నారో.. అమెరికాలో ఏం జరగనుందో వెయిట్ అండ్ సీ!

థెరపీ కాదు.. బలవంతం - Tholi Paluku