Let's talk: editor@tmv.in
థాయ్‌లాండ్ మాస్టర్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన దేవిక సిహాగ్

థాయ్‌లాండ్ మాస్టర్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన దేవిక సిహాగ్

Shaik Mohammad Shaffee
31 జనవరి, 2026

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి దేవిక సిహాగ్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె సంచలన విజయం సాధించింది. స్థానిక అభిమానుల మద్దతు ఉన్న టాప్ సీడ్ క్రీడాకారిణి సుపనిద కాటెథాంగ్‌ను దేవిక వరుస గేముల్లో ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కేవలం 40 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-19, 21-18 తేడాతో దేవిక గెలుపొంది సంచలనం సృష్టించింది.

ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరు

మ్యాచ్ ప్రారంభంలో దేవిక కొంత తడబడింది. మొదట్లో 0-5తో వెనుకబడినప్పటికీ, పట్టువదలకుండా పోరాడింది. ప్రత్యర్థి తప్పులను ఆసరాగా చేసుకుంటూ స్కోరును 9-9 వద్ద సమం చేసింది. ఆ తర్వాత నెట్ వద్ద అద్భుతమైన షాట్లతో పాయింట్లు సాధిస్తూ తొలి గేమ్‌ను 21-19తో కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా సుపనిద గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, దేవిక తన స్మాష్‌లు, వేగవంతమైన కదలికలతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించింది.

సెమీఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్‌తో పోటీ

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానంలో ఉన్న 20 ఏళ్ల దేవిక, సెమీఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి హువాంగ్ యు-హున్‌తో తలపడనుంది. గత ఏడాది మలేషియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న దేవిక, ప్రస్తుతం అదే ఊపుతో ఈ టోర్నీలో కూడా టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సీజన్‌లో ఇండోనేషియా మాస్టర్స్ రన్నరప్‌గా నిలవడమే కాకుండా స్వీడిష్ ఓపెన్, పోర్చుగల్ ఇంటర్నేషనల్ టైటిళ్లను దేవిక గెలుచుకుంది.

దేవిక సెమీస్‌కు చేరి సంతోషాన్ని అందించగా, మిగిలిన భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో మరో క్రీడాకారిణి ఇషారాణి బారువా క్వార్టర్ ఫైనల్లో మలేషియా ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. అలాగే పురుషుల సింగిల్స్‌లో తరుణ్ మన్నెపల్లి చైనా ఆటగాడు జు జువాన్ చెన్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత ఆశలన్నీ దేవిక సిహాగ్‌పైనే ఉన్నాయి.

థాయ్‌లాండ్ మాస్టర్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన దేవిక సిహాగ్ - Tholi Paluku