Let's talk: editor@tmv.in
థాయ్‌లాండ్ మాస్టర్స్: రెండో రౌండ్‌లో కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్

థాయ్‌లాండ్ మాస్టర్స్: రెండో రౌండ్‌లో కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్

Shaik Mohammad Shaffee
29 జనవరి, 2026

థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిరణ్ జార్జ్ కేవలం 27 నిమిషాల్లోనే మలేషియాకు చెందిన షోలే ఐదిల్‌పై 21-15, 21-9తో అలవోకగా విజయం సాధించారు. మరోవైపు మిథున్ మంజునాథ్ సంచలన ఆటతీరుతో ఎనిమిదో సీడ్ మాగ్నస్ జోహన్నెసెన్ (డెన్మార్క్)కు షాక్ ఇచ్చారు. సుమారు గంటపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో మంజునాథ్ 21-12, 9-21, 21-17 తేడాతో గెలిచి రెండో రౌండ్‌కు చేరారు.

తరుణ్ మన్నెపల్లి విజయం.. ప్రియాన్షుకు నిరాశ

యువ క్రీడాకారుడు తరుణ్ మన్నెపల్లి కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. థాయ్‌లాండ్ క్రీడాకారుడు కంటాఫోన్‌పై 22-20, 21-17తో చెమటోడ్చి విజయం సాధించారు. అయితే స్టార్ ప్లేయర్ ప్రియాన్షు రాజవత్ పోరాడి ఓడిపోయారు. కెనడాకు చెందిన బ్రియాన్ యాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-15, 13-21, 20-22తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్నారు. వీరితో పాటు మన్‌రాజ్ సింగ్, శంకర్ ముత్తుసామి కూడా తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓటమి పాలై టోర్నీ నుండి నిష్క్రమించారు.

మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖర్బ్ జోరు

మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్ ఘన విజయం సాధించారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన లో సిన్ యాన్‌ను 21-12, 21-12తో వరుస సెట్లలో చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తర్వాతి రౌండ్‌లో ఆమె తైపీకి చెందిన హువాంగ్ యు-సున్‌తో తలపడనున్నారు. మరోవైపు తస్నిమ్ మీర్, అనుపమ ఉపాధ్యాయ, తాన్యా హేమంత్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టారు.

శ్రేయాన్షి ముందడుగు.. మాళవిక ఔట్

భారత క్రీడాకారిణి శ్రేయాన్షి వలిశెట్టి కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌పై 14-21, 21-13, 21-19తో అద్భుత విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఇక ఇద్దరు భారతీయుల మధ్యే జరిగిన పోరులో ఇషారాణి బారువా తన తోటి క్రీడాకారిణి మాళవిక బన్సోద్‌ను 21-12, 21-8తో సులభంగా ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ రావత్ - మనీషా జోడీ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై నిరాశపరిచారు.