Let's talk: editor@tmv.in
థాయ్‌లాండ్ నుంచి డిపోర్ట్ అయిన లూథ్రా సోదరులు

థాయ్‌లాండ్ నుంచి డిపోర్ట్ అయిన లూథ్రా సోదరులు

Pinjari Chand
17 డిసెంబర్, 2025

గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ నైట్‌క్లబ్‌కు సహ యజమానులైన గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా అనే సోదరులు థాయ్‌లాండ్ డిపోర్ట్ చేయడంతో మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. వారు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గౌరవ్ లూథ్రా వయస్సు 44 ఏళ్లు కాగా, సౌరభ్ లూథ్రా వయస్సు 40 సంవత్సరాలు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం వారిని కస్టడీలోకి తీసుకున్నారు. త్వరలోనే వారిని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

డిసెంబర్ 6న ఉత్తర గోవాలోని ఆర్పోరా ప్రాంతంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఈ ఘటన నైట్‌క్లబ్ యాజమాన్యం పాటించాల్సిన అగ్ని భద్రతా నిబంధనలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ క్లబ్‌ను నిర్వహించడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లూథ్రా సోదరులపై కల్పబుల్ హోమిసైడ్ (మానవ హత్యకు సమానమైన నేరం), నిర్లక్ష్యం వహించినందుకు కేసులు నమోదు చేశారు.

థాయ్ అధికారులతో సమన్వయం

ఈ ఘటన తర్వాత వారు దేశం విడిచి వెళ్లడంతో, డిసెంబర్ 11న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో వారిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకొని, థాయ్ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని డీపోర్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం లూథ్రా సోదరుల పాస్‌పోర్టులను రద్దు చేసి, వారి పాత్రకు సంబంధించిన వివరాలతో ఒక డోసియర్‌(నేరానికి సంబంధించి వివరాల ఫైల్ )ను థాయ్ అధికారులకు సమర్పించి అధికారికంగా డిపోర్టేషన్ కోరింది. వారు దేశం విడిచి వెళ్లిన నేపథ్యంలో లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు.

ఈ కేసులో ఇప్పటికే గోవా పోలీసులు నైట్‌క్లబ్‌కు చెందిన ఐదుగురు మేనేజర్లు, సిబ్బందిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, బాంబే హైకోర్టు సోమవారం ‘బిర్చ్ బై రోమియో లేన్’పై దాఖలైన ఒక సివిల్ సూట్‌ను పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పీఐఎల్)గా మార్చింది.ఈ విషాదానికి ఎవరో ఒకరు తప్పకుండా బాధ్యత వహించాలని కోర్టు వ్యాఖ్యానించింది. భారత్–థాయ్‌లాండ్ మధ్య 2013లో ఎక్స్‌ట్రడిషన్ ఒప్పందం కుదిరింది, అది జూన్ 2015 నుంచి అమల్లోకి వచ్చింది.

థాయ్‌లాండ్ నుంచి డిపోర్ట్ అయిన లూథ్రా సోదరులు - Tholi Paluku