
థాయ్‌లాండ్‌లో ముగిసిన పోలింగ్.. హంగ్ దిశగా ఫలితాలు!
థాయ్‌లాండ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరదించేలా ఆదివారం సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న 53 మిలియన్ల మంది (5.3 కోట్ల మంది) ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఉత్సాహంగా ఓటు వేశారు. నెమ్మదించిన ఆర్థిక వృద్ధి, పొరుగున ఉన్న కంబోడియాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు ఆ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. 50కి పైగా పార్టీలు బరిలో ఉన్నప్పటికీ, ప్రధానంగా మూడు పక్షాల మధ్యే అధికారం కోసం గట్టి పోటీ నెలకొంది.
త్రిముఖ పోరులో ప్రధాన పక్షాలు
ప్రస్తుత ఎన్నికల్లో పీపుల్స్ పార్టీ, భూమ్‌జైథాయ్, ఫ్యూ థాయ్ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. 500 సీట్లున్న దిగువ సభలో మెజారిటీ సాధించేందుకు ఏ పార్టీకి స్పష్టమైన అవకాశం లేదని ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సంస్కరణల నినాదంతో పీపుల్స్ పార్టీ
గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ అధికారానికి దూరమైన 'మూవ్ ఫార్వర్డ్' పార్టీ వారసుడిగా పీపుల్స్ పార్టీ (నట్టపాంగ్ రుయాంగ్‌పన్యావుత్ నాయకత్వంలో) బరిలోకి దిగింది. సైన్యం, పోలీసు, న్యాయ వ్యవస్థల్లో భారీ సంస్కరణలు చేపట్టాలని, రాచరిక విమర్శలపై ఉన్న కఠిన చట్టాలను సవరించాలని ఈ పార్టీ వాదిస్తోంది. ముఖ్యంగా యువత, పట్టణ ఓటర్ల మద్దతును ఈ పార్టీ ఎక్కువగా ఆశిస్తోంది.
రక్షణాత్మక ధోరణిలో భూమ్‌జైథాయ్
ప్రస్తుత ఆపద్ధర్మ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ నేతృత్వంలోని భూమ్‌జైథాయ్ పార్టీ సంప్రదాయవాదానికి, సైనిక దళాల మద్దతుకు చిరునామాగా నిలుస్తోంది. కంబోడియాతో సరిహద్దు ఘర్షణల సమయంలో అనుతిన్ అనుసరించిన కఠిన వైఖరి ఆయనకు 'యుద్ధకాలపు నాయకుడు'గా గుర్తింపు తెచ్చింది. జాతీయ భద్రత, ఆర్థిక ఉద్దీపన పథకాలే ఈ పార్టీ ప్రధాన అజెండా.
థాక్సిన్ వారసత్వంతో 'ఫ్యూ థాయ్'
మాజీ ప్రధాని థాక్సిన్ షినవత్రా కుటుంబం మద్దతు ఉన్న ఫ్యూ థాయ్ పార్టీ, ఈసారి ఆయన మేనల్లుడు యోధ్ చానన్ వోంగ్‌సవత్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టును ఉపయోగించుకుని, నగదు బదిలీ వంటి ప్రజాకర్షక పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ పార్టీ ప్రయత్నిస్తోంది.
రాజ్యాంగంపై రెఫరెండం
ఎన్నికలతో పాటే 2017 నాటి సైనిక ముసాయిదా రాజ్యాంగాన్ని మార్చాలా? వద్దా? అనే అంశంపై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) కూడా నిర్వహించారు. ఒకవేళ ప్రజలు రాజ్యాంగ సవరణకు మొగ్గు చూపితే, సైన్యం, న్యాయవ్యవస్థకు ఉన్న అపరిమిత అధికారాలను తగ్గించే దిశగా అడుగులు పడతాయి.
ఫలితాల నిరీక్షణ
ఆదివారం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, అర్థరాత్రి కల్లా ప్రాథమిక ఫలితాల సరళి వెల్లడైంది. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని పక్షంలో.. సంస్కరణల నినాదంతో వస్తున్న పీపుల్స్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు భూమ్‌జైథాయ్, ఫ్యూ థాయ్ పార్టీలు జట్టు కట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
