
థాయ్-కంబోడియా సరిహద్దులో యుద్ధ వాతావరణం
ఆగ్నేయాసియా పొరుగు దేశాలైన థాయ్‌లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. బుధవారం నాటి ఘర్షణల్లో థాయ్‌లాండ్ సైన్యం ఎఫ్-16 యుద్ధ విమానాలతో కంబోడియా గ్రామాలలో బాంబులు వేయగా, ప్రతిగా కంబోడియా సైన్యం థాయ్‌లాండ్‌లోని ఒక ఆసుపత్రిపై రాకెట్లను ప్రయోగించింది.
వైమానిక దాడులతో వణికిన కంబోడియా గ్రామాలు
'ఖ్మెర్ టైమ్స్' నివేదిక ప్రకారం, బుధవారం థాయ్ సైన్యం ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను ఉపయోగించి బంటెయ్ మీన్చే ప్రావిన్స్‌లోని స్లోర్ క్రామ్ గ్రామంలో రెండు బాంబులు వేసింది. థాయ్‌లాండ్ సైన్యం ఫైటర్ జెట్‌లను ఉపయోగించి థి మామ్ థి, అన్ సేస్, ఫ్నోమ్ ఖాక్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రీహ్ విహియార్ ఆలయంతో సహా పలు ప్రాంతాలపై దాడి చేసింది. పుర్సాట్ ప్రావిన్స్‌లోని చే ప్రాంతంపై ఫిరంగి గుండ్లను, డ్రోన్‌ల ద్వారా బాంబులు వేసినట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. థాయ్‌లాండ్ సైన్యం గతంలో కంబోడియన్లు ఆక్రమించిన సా కైయోలోని బాన్ నాంగ్ యా కెవ్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో కంబోడియా సైన్యం తమ సైనికులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి సిద్ధం చేసిన యాంటీ-పర్సనల్ ల్యాండ్‌మైన్‌లు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను కనుగొన్నారు.
థాయ్‌లాండ్ ఆసుపత్రిపై రాకెట్ల దాడి
'బ్యాంకాక్ పోస్ట్' ప్రకారం, కంబోడియా నుండి ప్రయోగించిన రాకెట్లు బుధవారం ఉదయం సురిన్ ప్రావిన్స్‌లోని పానోమ్ డాంగ్ రాక్ ఆసుపత్రిని తాకాయి. ఈ ఆసుపత్రిపై జూలైలో కూడా రాకెట్ల దాడి జరిగింది. బుధవారం ఉదయం 8.40 గంటలకు (స్థానిక సమయం) కంబోడియా ఆసుపత్రిపై, దాని పరిసర ప్రాంతాలపై ఆరు రాకెట్లను ప్రయోగించింది. దీంతో వైద్య సిబ్బంది, రోగుల భద్రత కోసం వారిని వెంటనే అక్కడి నుండి తరలించాల్సి వచ్చింది. ఈశాన్య ప్రాంతాన్ని పర్యవేక్షించే థాయ్‌లాండ్ రెండవ ఆర్మీ రీజియన్ ప్రకారం, సరిహద్దులోని 12 ప్రాంతాలలో ఘర్షణలు కొనసాగుతున్నాయి.
భారీగా ప్రాణనష్టం
థాయ్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కంబోడియా దళాలు 5,000 రాకెట్లను ప్రయోగించి, సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా ఉబోన్ రాచతానిలోని చోంగ్ అన్ మా, చోంగ్ బోక్ ప్రాంతాలలో ఆత్మహుతి డ్రోన్‌లతో దాడి చేశాయి. ఈ ఘర్షణల్లో నలుగురు థాయ్ సైనికులు మరణించగా, 68 మంది గాయపడ్డారు. అలాగే 61 మంది కంబోడియా సైనికులు మరణించినట్లు సమాచారం. గాయపడిన కంబోడియా సైనికుల సంఖ్యపై ఇంకా అంచనా వేయలేదు.
శాంతి ఒప్పందం రద్దు
అక్టోబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని థాయ్‌లాండ్ సస్పెండ్ చేసిన కొద్ది వారాలకే ఈ కొత్త ఘర్షణలు జరిగాయి. ఆ ఒప్పందం కుదిరిన తరువాత సరిహద్దులో ల్యాండ్‌మైన్ పేలుడు కారణంగా ఇద్దరు థాయ్ సైనికులు గాయపడినందున థాయ్‌లాండ్ నవంబర్‌లో ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండటాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
నేను యుద్ధాన్ని ఆపుతాను: ట్రంప్
ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ఆర్థిక వ్యవస్థపై ప్రసంగిస్తూ థాయ్-కంబోడియా ఘర్షణలపై స్పందించారు. "నేను ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నాను, కంబోడియా- థాయ్‌లాండ్ మళ్లీ ఘర్షణలు ప్రారంభించాయి. “నేను ఫోన్ చేసి ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతాను. శాంతిని నెలకొల్పుతాను" అని ఆయన అన్నారు. ట్రంప్ గత 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్న వాటిలో థాయ్‌లాండ్-కంబోడియా ఘర్షణ కూడా ఒకటి.
వివాదానికి కారణం
థాయ్‌లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది, దీనికి మూల కారణం 1907లో ఫ్రెంచ్ అధికారులు రూపొందించిన వలస పాలన కాలం నాటి మ్యాప్‌లో ఉన్న లోపాలే. ఈ వివాదానికి కేంద్ర బిందువు – ప్రీహ్ విహియార్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం. ఈ ఆలయం కంబోడియా భూభాగంలో ఉందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పినా, థాయ్‌లాండ్ మాత్రం దాని చుట్టుపక్కల ప్రాంతాలపై హక్కులను వదులుకోలేదు. ఈ సరిహద్దు ఉద్రిక్తతలు తరచూ తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. జూలైలో కూడా ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా, దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా ఈ ఘర్షణలు ఆగ్నేయాసియా ప్రాంత శాంతికి పెను సవాలుగా మారాయి.
