
థాయ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు.. అడ్వైజరీ జారీ చేసిన భారత్
థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతాలకు వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారతీయ ప్రయాణికులు థాయిలాండ్ అధికారిక సంస్థల నుంచి తాజా సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే ఆ ప్రాంతాలను సందర్శించాలని రాయబార కార్యాలయం కోరింది.
థాయిలాండ్ పర్యాటక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రయాణాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఆంక్షలు కేవలం కొన్ని సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రధాన పర్యాటక కేంద్రాలు అయిన బ్యాంకాక్, చియాంగ్ మాయి, ఫుకెట్, సమూయి, క్రాబీ, పట్టాయా, అయోథాయ వంటి నగరాలు యథావిధిగా తెరిచి ఉన్నాయి. కేవలం సరిహద్దుల్లో మాత్రమే ఆంక్షలు విధించారు. సరిహద్దుకు వెళ్లే రైలు సేవలను (బాన్ ఖ్లోంగ్ ల్యూక్‌కు) నిలిపివేశారు. అలాగే, కొన్ని బస్సు మార్గాలను మళ్లించారు. బురీ రామ్‌లోని రూట్ 348 వైపు వెళ్లకూడదని ప్రయాణికులకు సూచించారు.
సరిహద్దులో ఏం జరుగుతోంది?
థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య 800 కిలోమీటర్లకు పైగా సరిహద్దును సరిగ్గా గుర్తించకపోవడం ఈ వివాదానికి మూల కారణం. సరిహద్దులో డిసెంబర్ 10న ఫిరంగి, రాకెట్ దాడులతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడులకు తాము కారణం కాదంటే తాము కాదని రెండు దేశాలూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.
కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, థాయ్‌లాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియాలోని ఐదు ప్రావిన్సులపై బాంబులు వేశాయి. ఈ దాడుల్లో సైనిక ప్రాంతాలతో పాటు పౌర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి. కంబోడియా అధికారులు పౌరులు నివసించే ఇళ్లు, పాఠశాలలు, రోడ్లు, బౌద్ధ దేవాలయాలు, పురాతన ఆలయాలకు నష్టం జరిగిందని తెలిపారు. థాయ్‌లాండ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఐదు రోజుల్లో తొమ్మిది మంది సైనికులు మరణించారని, 120 మంది గాయపడ్డారని ప్రకటించింది. కంబోడియాలో 10 మంది పౌరులు మరణించినట్లు సమాచారం.
చారిత్రక వారసత్వానికి ముప్పు
సరిహద్దుకు దగ్గరలో ఉన్న ప్రెహ్ విహియర్ టెంపుల్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంపై యూనెస్కో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యునెస్కో ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి అంతర్జాతీయ ఒప్పందాలను (1954 హేగ్ కన్వెన్షన్, 1972 ప్రపంచ వారసత్వ కన్వెన్షన్) గుర్తుంచుకోవాలని కోరింది.
అంతర్జాతీయ జోక్యం
ఈ సరిహద్దు వివాదం చాలా దశాబ్దాలుగా కొనసాగుతోందని, గతంలో తాను ఈ సమస్యను పరిష్కరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మళ్లీ ఘర్షణలు ఆపాలని థాయిలాండ్, కంబోడియా నాయకులతో మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు. "ఇది చాలా తొందరగా నేను పరిష్కరించగలను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం కూడా రెండు దేశాల ప్రధానులతో మాట్లాడారు. స్థిరత్వం కోసం అంతర్జాతీయ చట్టం ప్రకారం శాంతియుత చర్చలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.
థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వివాదం
థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. దాదాపు 800 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో ఎక్కడ సరిహద్దు గీయాలో స్పష్టంగా గుర్తించని ప్రాంతాల విషయంలోనే ఈ గొడవ ఉంది. 1907లో ఫ్రెంచ్ పాలకులు (అప్పట్లో కంబోడియాకు వాళ్లే పాలకులు) గీసిన పటం (మ్యాప్) నుంచే ఈ వివాదం మొదలైంది. ఆ పటం ప్రకారం వివాదాస్పదమైన ప్రెహ్ విహియర్ ఆలయం కంబోడియాలో ఉంది. 1962లోనే అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయం కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయినా సరే, 2008లో కంబోడియా ఈ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం దరఖాస్తు చేసినప్పుడు మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. దీనివల్ల కొన్ని సంవత్సరాలు అడపాదడపా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారు 20 మంది మరణించిన తర్వాత, కంబోడియా 2011లో మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు 2013లో ఆలయం కంబోడియాకే చెందుతుందని తమ పాత తీర్పును మరోసారి బలపరిచింది.
