
థాయిలాండ్ జాతిమాత గా ఉన్న మాజీ రాణి సిరికిత్ మృతి
థాయిలాండ్ జాతి మాత గా ఉన్న మాజీ రాణి సిరికిత్ 93 ఏళ్ల వయసులో, అక్టోబర్ 24, 2025, శుక్రవారం రోజున రక్త ఇన్‌ఫెక్షన్ తో పోరాడుతూ మరణించినట్లు ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖ ప్రకటించింది. థాయ్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన చులాలాంగ్‌కార్న్ హాస్పిటల్‌లో ఆమె ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు.
ఆగస్టు 12, 1932న జన్మించిన రాణి సిరికిత్ పుట్టినరోజును థాయిలాండ్‌లో జాతీయ సెలవుదినంగా 'మదర్స్ డే' (మాతృ దినోత్సవం) గా జరుపుకుంటారు. ఆమె 18 ఏళ్ల వయసులో రాజు భూమిబోల్‌ను వివాహం చేసుకున్నారు. భూమిబోల్ తర్వాత చక్రీ రాజవంశంలో తొమ్మిదవ రాజు అయ్యారు. వీరు ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రాజ దంపతుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన దేశాధినేత కింగ్ భూమిబోల్ 2016లో మరణించారు. వారి కుమారుడు కింగ్ మహా వజ్రాలొంగ్‌కార్న్ ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్టించారు. రాణి సిరికిత్ 2012లో పక్షవాతం వచ్చిన తర్వాత బహిరంగ కార్యక్రమాలలో చాలా అరుదుగా కనిపించారు.
తన జీవితమంతా, ఆమె బౌద్ధ సమూహాలకు చురుకుగా మద్దతు ఇచ్చారు. థాయ్ హస్తకళలను ప్రోత్సహించారు. గ్రామీణ మహిళలు నేసిన వస్తువుల ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించడానికి సహాయంగా ఉండడానికి ఆమె సపోర్ట్ ఫౌండేషన్‌ను స్థాపించారు. అలాగే తన భర్త ప్రారంభించిన వందలాది అభివృద్ధి ప్రాజెక్టులను ఆమె వ్యక్తిగతంగా సందర్శించారు. తన అందచందాలతో ప్రసిద్ధి చెందిన రాణి సిరికిత్ 1960లలో నాలుగుసార్లు 'ఇంటర్నేషనల్ బెస్ట్ డ్రెస్డ్ లిస్ట్'లో అగ్రస్థానంలో నిలిచారు. యుద్ధానంతర రాజరికం పునరుద్ధరణకు ఆమె ఒకప్పుడు అద్భుతమైన ప్రతినిధిగా నిలిచారు. థాయిలాండ్ రాజ్యాంగబద్ధమైన రాజరికం ప్రత్యక్ష రాజకీయ అధికారాన్ని కలిగి ఉండకపోయినా, అది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
జాతీయ అశాంతి సమయాల్లో ఆమె ప్రభావం కొన్నిసార్లు రాజకీయంగా ముఖ్యమైనదిగా ఉండేది. ఆమె కొంతమంది ప్రభుత్వ నాయకులకు, రాజరిక అనుకూల నిరసనకారులకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు థాయిలాండ్ రాజకీయాలలో రాజరికం యొక్క తెరవెనుక పాత్రపై చర్చకు దారితీశాయి.
రాణి మృతికి సంతాప సూచకంగా ప్యాలెస్ సంవత్సరం పొడవునా సంతాప కాలాన్ని ప్రకటించింది. ఆమె గౌరవార్థం థాయిలాండ్‌లో 30 రోజుల పాటు వినోద కార్యక్రమాలు, కచేరీలు రద్దు అయ్యే అవకాశం ఉంది. రాణి సిరికిత్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఆమె సోదరి బుస్బా కితియాకర సతనాపాంగ్ ఉన్నారు.
