
థామస్, ఉబర్ కప్: బరిలోకి భారత షట్లర్లు
ప్రతిష్ఠాత్మకమైన థామస్, ఉబర్ కప్-2026 బ్యాడ్మింటన్ టోర్నీలకు భారత పురుషుల, మహిళల జట్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. వెటరన్ క్రీడాకారులతో పాటు అద్భుత ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లతో కూడిన సమతుల్యమైన జట్లను ఎంపిక చేశారు. మార్చి 10 నాటి బి.డబ్ల్యూ.ఎఫ్ ర్యాంకింగ్‌లను ప్రాతిపదికగా తీసుకుని, టాప్-5 సింగిల్స్ ఆటగాళ్లు, టాప్-2 డబుల్స్ జంటలకు చోటు కల్పించారు. జట్టు అవసరాల దృష్ట్యా అదనపు క్రీడాకారులను కూడా ఎంపిక చేశారు.
థామస్ కప్: టైటిల్ వేటలో భారత్
2022లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత పురుషుల జట్టు.. మరోసారి అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ వంటి హేమాహేమీలు జట్టును నడిపించనున్నారు. యువ సంచలనం ఆయుష్ శెట్టి తొలిసారి థామస్ కప్ జట్టులో చోటు సంపాదించడం విశేషం. కిరణ్ జార్జ్ సింగిల్స్ విభాగానికి మరింత బలాన్ని చేకూర్చనున్నారు. డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఎం.ఆర్.అర్జున్, హరిహరన్ అంసకరుణన్‌లతో జతకట్టి డబుల్స్‌ను పటిష్టం చేయనున్నారు. అనుభవజ్ఞుడైన ధ్రువ్ కపిల రాకతో జట్టు కూర్పు మరింత మెరుగ్గా మారింది.
ఉబర్ కప్: సింధు సేన సిద్ధం
మహిళల విభాగంలో స్టార్ ప్లేయర్ పి.వి.సింధు భారత జట్టుకు సారథ్యం వహించనుంది. గతంలో సెమీఫైనల్‌తో సరిపెట్టుకున్న భారత్, ఈసారి అంతకంటే మెరుగైన ఫలితం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సింగిల్స్‌లో ఉన్నతి హుడా, టీనేజర్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా, దేవిక సిహాగ్ వంటి వర్ధమాన క్రీడాకారిణులు ఎంపికయ్యారు. థాయ్‌లాండ్ మాస్టర్స్ విజేత దేవిక, ఆర్లియన్స్ మాస్టర్స్ సెమీఫైనలిస్ట్ ఇషారాణిలు అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఉన్నతి హుడా ఇప్పటికే మూడు సీనియర్ టైటిళ్లను గెలుచుకోవడం విశేషం.
మహిళల డబుల్స్ విభాగంలో..
మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ కీలక పాత్ర పోషించనుంది. డబుల్స్ ఫార్మాట్లలో అపార అనుభవం ఉన్న తనిషా క్రాస్టో జట్టుకు అదనపు బలం. కవిప్రియ సెల్వం ఈ టోర్నీ ద్వారా అరంగేట్రం చేయనుండగా, ఆమె సిమ్రాన్ సింఘీతో జతకట్టనుంది. "మా జట్లలో అనుభవం, యువత కలయిక బాగుంది. సీనియర్లు జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తే, యువత అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వారు ఈ స్థాయిలో రాణించగలరని నిరూపించారు" అని బి.ఏ.ఐ జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా ధీమా వ్యక్తం చేశారు.
భారత పురుషుల జట్టు (థామస్ కప్) : లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, కిరణ్ జార్జ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, హరిహరన్ అంసకరుణన్, ఎం.ఆర్.అర్జున్, ధ్రువ్ కపిల.
భారత మహిళల జట్టు (ఉబర్ కప్):
పి.వి.సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పుల్లెల, కవిప్రియ సెల్వం, సిమ్రాన్ సింఘీ, తనిషా క్రాస్టో
