Let's talk: editor@tmv.in
థానే బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 452 కోట్ల సంపద!

థానే బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 452 కోట్ల సంపద!

T Venkata Ramana
14 అక్టోబర్, 2025

అది ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు. భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకులో దాచుకున్న సొమ్ము. కాలగమనంలో ఆ ఖాతాదారులకు ఏమైందో వారి వారసులకు ఆ డిపాజిట్ల గురించి సమాచారం ఉందో లేదో తెలియదు గానీ, మహారాష్ట్రలోని థానే జిల్లా బ్యాంకుల్లో అక్షరాలా రూ. 452 కోట్లకు పైగా అపార సంపద అనాథలా పడి ఉంది. సుమారు 11.38 లక్షల బ్యాంకు ఖాతాలలో ఈ భారీ మొత్తం చిక్కుకుపోయి తమ హక్కుదారుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఈ మరుగునపడిన నిధులను తిరిగి వాటి అసలైన యజమానులకు లేదా వారి చట్టపరమైన వారసులకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

‘మీ సంపద - మీ హక్కు’ అంటూ మహాయజ్ఞం

దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పేరుకుపోయిన క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్య తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ఆర్థిక సేవల విభాగం, ఆర్‌బీఐ "మీ సంపద, మీ హక్కు" (యువర్ వెల్త్, యువర్ రైట్) పేరుతో జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా, థానే జిల్లాలో "క్లెయిమ్ యువర్ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్" (మీ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోండి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకుంది.

డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్

అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ ప్రత్యేక ప్రచారం డిసెంబర్ 31 వరకు మూడు నెలల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు తమ శాఖలలో అవగాహన శిబిరాలు, ప్రత్యేక డ్రైవ్‌లు, ఔట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఈ విషయంపై చైతన్యం కల్పిస్తాయి. ఎవరైనా తమ కుటుంబ సభ్యులు లేదా బంధువుల పేరు మీద చాలాకాలంగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలు ఉన్నాయేమో పరిశీలించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

డబ్బు మీదే.. వడ్డీతో సహా పొందండి

ఈ విషయంపై థానే లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అభిషేక్ పవార్ మాట్లాడుతూ "డిపాజిటర్లకు తమ డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందే పూర్తి హక్కు ఉంది. ఒకవేళ ఆ నిధులు 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్' కు బదిలీ అయినప్పటికీ, సరైన రుజువులు సమర్పించి ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఖాతాదారులు జీవించి ఉంటే వారే నేరుగా లేదా, వారి చట్టపరమైన వారసులు తగిన పత్రాలు, సాంకేతిక ఆధారాలు చూపించి ఈ నిధులను పొందవచ్చు. ఈ మూడు నెలల ప్రచారం యొక్క ఏకైక లక్ష్యం ఈ రూ.452.39 కోట్లను వాటి హక్కుదారులకు చేర్చడమే" అని స్పష్టం చేశారు.

క్లెయిమ్ చేసుకోవడం ఎలా?

తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఆర్‌బీఐ ఒక సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. UDGAM పోర్టల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన UDGAM ( అన్ క్లేమ్‌డ్ డిపాజిట్స్ గేట్ వే టు ఆక్సిస్ ఇన్ఫర్మేషన్) పోర్టల్ ([https://udgam.rbi.org.in](https://udgam.rbi.org.in)) ద్వారా ప్రజలు తమ ఇంట్లో నుంచే బహుళ బ్యాంకులలోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఒకేచోట సులభంగా శోధించవచ్చు.

బ్యాంకు శాఖను సంప్రదించడం

తమకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖను నేరుగా సందర్శించి, అవసరమైన క్లెయిమ్ ఫారమ్, కేవైసీ పత్రాలను సమర్పించడం ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. తమ వారి సంపద ఎక్కడో బ్యాంకుల్లో మూలుగుతోందని తెలియక ఎందరో వారసులు ఆర్థిక ఇబ్బందులు పడుతుండవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ బంధువులు, మిత్రులకు ఈ సమాచారాన్ని చేరవేయడం ద్వారా ఎవరిదో కష్టార్జితం వారికి దక్కేలా సహాయపడవచ్చు.

రెండేళ్లులావాదేవీలు జరకపోతే

రెండు సంవత్సరాలు బ్యాంకు లావాదేవీలు జరుగకుండా గడిస్తే ఆ ఖాతాను ఇన్ ఆపరేటివ్ అకౌంట్ గా పరిగణిస్తారు. ఖాతాదారుడు, నామినీ పది సంవత్సరాలపాటు డబ్బు క్లెయిమ్ చేయకపోతే, ఆ మొత్తాన్ని బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దనున్న డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్ నెస్ (డీఈఏ) ఫండ్ ‌కి బదిలీ చేస్తాయి.

అయితే ఆ డబ్బు రద్దు కాదు. అసలు ఖాతాదారుడు, వారసులు ఎప్పుడైనా ఆధార పత్రాలతో బ్యాంకు ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ నిధిని ఆర్.బి.ఐ ప్రజలకు డిపాజిట్ అవగాహన కార్యక్రమాలకు కూడా వినియోగిస్తుంది.

క్లెయిమ్ ఎలా చేయాలి

వారసులు లేదా నామినీలు క్లెయిమ్ చేసేటప్పుడు మరణ ధృవపత్రం, ఆధార్, పాన్, లీగల్ హెయిర్, సక్సెషన్ సర్టిఫికేట్ వంటి పత్రాలు అందజేయాలి. చిన్న మొత్తాల కోసం తహసీల్దార్ జారీ చేసిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సరిపోతుంది. పెద్ద మొత్తాలకు కోర్టు సక్సెషన్ సర్టిఫికేట్ అవసరం కావచ్చు. ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వదిలిన ఈ నిధులు రద్దుకావు. ఆర్.బి.ఐ వద్ద భద్రంగా ఉంటాయి. అవగాహన కలిగి సమయానికి చర్యలు తీసుకుంటే,తమ హక్కైన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు.

థానే బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 452 కోట్ల సంపద! - Tholi Paluku