Let's talk: editor@tmv.in
త్వరలో వేస్ట్‌మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

త్వరలో వేస్ట్‌మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

Panthagani Anusha
15 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణను ఆధునీకరించడంతో పాటు యువతలో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేసే దిశగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్‌కాస్ట్) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులు, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ భవానీపురంలోని వీడీ పురంలో ఉన్న ఆప్‌కాస్ట్ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన ఆయన సంస్థ కార్యకలాపాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు సరైన వేదిక కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ రంగం భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఇందులో మన రాష్ట్ర యువత కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తాం అని ఆయన పేర్కొన్నారు. కేవలం చెత్తను తొలగించడమే కాకుండా దానిని సంపదగా మార్చే ప్రక్రియలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

ఆప్‌కాస్ట్ సభ్య కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ కె.శరత్ కుమార్‌తో నిర్వహించిన భేటీలో పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల వినియోగం పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పారిశుద్ధ్య రంగంలో శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా స్థిరమైన వృద్ధిని సాధించవచ్చని పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా త్వరితగతిన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా మార్చే లక్ష్యంతో ఆప్‌కాస్ట్ ప్రతిపాదించిన ‘స్వచ్ఛ్ బడి’ కార్యక్రమాన్ని పట్టాభిరామ్ అభినందించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఆధునిక వాష్‌రూమ్ సౌకర్యాల కల్పనతో పాటు పారిశుద్ధ్య మౌలిక వసతుల పెంపునకు అవసరమైన ప్రతిపాదనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ భేటీ ద్వారా రాష్ట్రంలో శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థ బలోపేతానికి పునాదులు పడ్డాయని ఆప్‌కాస్ట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

త్వరలో వేస్ట్‌మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్ - Tholi Paluku