Let's talk: editor@tmv.in
త్వరలో విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
9 మార్చి, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జ్యోతిరావు పూలే భవన్‌లో ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళా కళాశాల విద్యార్థినులకు ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటర్లు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. మహిళల విద్య, స్వయం సాధికారత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా మహిళా కళాశాల విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించాలనే ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు కావడం కష్టమవుతుందని, కానీ ప్రభుత్వం దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తోందని తెలిపారు. విద్యార్థినులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ హిత రవాణాకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాలుష్య రహిత హైదరాబాద్‌ వైపు అడుగులు

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని సీఎం చెప్పారు. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సుమారు 2,800 డీజిల్ బస్సులను నగర పరిధి బయటకు తరలిస్తున్నామని తెలిపారు. 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో డీజిల్ బస్సులు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ ఎసీ వాహనాలను ప్రవేశపెట్టామ‌ని, అలాగే ఎలక్ట్రిక్ ఎసీ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.

అదే విధంగా ప్రస్తుతం డీజిల్ లేదా ఇతర ఇంధనాలతో నడుస్తున్న సుమారు రెండు లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది కీలక చర్యగా భావిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించడంలేదని, ప్రజలు ఎక్కువగా ఈ వాహనాలను వినియోగించేందుకు ప్రోత్సహిస్తున్నామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు లోపల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. అలాగే కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను నగరానికి బయటకు తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాలుష్య సూచిక 60కు పైగా ఉన్న పరిశ్రమలు రెడ్ కేటగిరీగా, 41 నుంచి 59 మధ్య ఉన్నవి ఆరెంజ్ కేటగిరీగా పరిగణించబడతాయని సీఎం వివరించారు.

నగరాల అభివృద్ధిపై విశ్లేషణ

దేశంలోని పలు ప్రధాన నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముంబై భారీ వర్షాల సమయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుందని, బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యంతో ఇబ్బందులు పడుతోందని, చెన్నై వరదల సమస్యను ఎదుర్కొంటుందని, కోల్‌కతా కూడా వివిధ సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమ నగరంగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు.

హైదరాబాద్ అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు ఎన్. చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేసిన కృషిని సీఎం గుర్తు చేశారు. ఆ అభివృద్ధి పునాది మీదనే నగరం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను టోక్యో లేదా సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయ‌న చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం సుమారు 200 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఎనిమిదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.

మూసీ ప్రక్షాళన - గాంధీ విగ్రహం

హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయనో, మూసీలో కాలుష్యం పారుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టకుండా అది ఎలా సాధ్యం. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దు అని సీఎం ప్ర‌శ్నించారు.

సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012 లో నిబంధనలు రూపొందించారు. నాలా అయితే బఫర్ జోన్ ఎంతుండాలి. చెరువులైతే ఎంతుండాలి. నదులైతే ఎంతుండాలన్నది ఖరారు చేశారు. ఆ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు అని ఆయ‌న తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మహాత్మా గాంధీకి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. ఆ విగ్రహం నిర్మాణానికి సుమారు రూ.70 కోట్లు ఖర్చవుతుందని, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే నాలెడ్జ్ సెంటర్‌కు రూ.100 కోట్లకు పైగా వ్యయం అవుతుందని వివరించారు.

ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రూ.5,000 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని సీఎం పేర్కొన్నారు. ముసీ నది బఫర్ జోన్‌లో భాగంగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్ సముదాయానికి ఇచ్చిన నోటీసుల విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచిస్తుందని సీఎం చెప్పారు.

మహిళా జర్నలిస్టులకు అండగా ప్రభుత్వం

మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పిస్తుందని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే దేశాలు బలపడతాయని పేర్కొన్నారు. సమాజంలో మహిళలపై ఉన్న వివక్షకు ముగింపు పలకాలని, వారి శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి మహిళా జర్నలిస్టుల సహకారం అవసరమని సీఎం పేర్కొన్నారు.