
త్వరలో లోక్‌సభ, అసెంబ్లీల సీట్లు పెంపుపై కీలక బిల్లు: కిరెన్ రిజిజు
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో సీట్ల సంఖ్య పెంపుతో పాటు మహిళల రిజర్వేషన్ అమలుకు సంబంధించిన కీలక బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌రిజిజు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్యసభను గురువారం వాయిదా వేసి త్వరలో మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ఆయన మాట్లాడుతూ, వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో ఒక ముఖ్యమైన బిల్లును పరిశీలించేందుకు సభ మళ్లీ సమావేశమవుతుందని తెలిపారు. ఈ విషయం గురించి ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చించినట్లు చెప్పారు. ఈ ప్రకటనతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభా నాయకుడు జెపీ నడ్డా ప్రభుత్వం ఎప్పుడు బిల్లును తీసుకురావాలనే నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు
అయితే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. మహిళల రిజర్వేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, కానీ బిల్లును ఎలా, ఎప్పుడు తీసుకురావాలనే విషయంపై రాజకీయ ఆటలు ఆడకూడదని అన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం బిల్లును తీసుకురావడం సరైనది కాదని విమర్శించారు. అందుకే ఆల్‌పార్టీ సమావేశాన్ని ఎన్నికలు పూర్తయ్యాక నిర్వహించాలని ప్రతిపక్షం కోరుతోందని చెప్పారు.
అయితే దీనిపై స్పందించిన రిజిజు, దేశ మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దీనికి రాష్ట్ర ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన చర్యలపై ప్రభుత్వం ప్రతిపక్షాలతో అనౌపచారిక చర్చలు జరుపుతోందని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా పీయూష్‌గోయల్ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ మహిళలకు శాసనసభల్లో రిజర్వేషన్ ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇక సంజయ్‌సింగ్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అలాగే ఎన్‌సీపీ (ఎస్‌సీపీ) నేత ఫౌజియా ఖాన్ రాజ్యసభ, రాష్ట్ర శాసన మండళ్లలో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారా అని ప్రశ్నించారు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా మహిళల రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మహిళలకు ఉప రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా గురువారం బడ్జెట్ సమావేశాల చివరి రోజున రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ సవరణ బిల్లు, అలాగే జన విశ్వాస్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళల రిజర్వేషన్ అమలుకు సంబంధించిన నారీ శక్తి వందన్ అధినియమ్ అమలుకు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు, డిలిమిటేషన్ వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
